తమ్ముడికి కోపమొచ్చిందని 434 మీటర్ల లెటర్​ రాసింది!

  • బ్రదర్స్ డే రోజు శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోయిన అక్క
  • తన మెసేజీని కూడా చూడకపోవడంతో తమ్ముడికి కోపం
  • తమ్ముడిపై తనకెంత ప్రేమ ఉందో చెబుతూ ఉత్తరం రాయడం మొదలుపెట్టిన అక్క
  • 5 కిలోల బరువైన ఆ లేఖను తమ్ముడికి పోస్ట్ చేసిన వైనం 
అది ప్రపంచ సోదరుల దినోత్సవం.. అదే బ్రదర్స్ డే.. అక్క తనకు శుభాకాంక్షలు చెబుతుందని తమ్ముడు ఆత్రంగా ఎదురుచూశాడు. సాయంత్రమైనా అక్క నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో తానే మెసేజీ పెట్టాడు. కానీ బ్రదర్స్ డే అని గుర్తు లేదో, మరేదో పనుల్లో ఉందోగానీ అక్క ఆ మెసేజీని కూడా చూసుకోలేదు. తమ్ముడిని విష్ చేయలేదు.

దీంతో ఆ తమ్ముడికి కోపం వచ్చి అలిగాడు. తన స్నేహితులను వాళ్ల అక్కా చెల్లెళ్లు ఎలా విష్ చేశారనే స్క్రీన్ షాట్లను అక్కకు వాట్సాప్ చేశాడు. తనను విష్ చేయడం మర్చి పోయావు కదా అంటూ మరో మెసేజీ పెట్టాడు. చివరికి అది చూసిన అక్క.. వెంటనే తమ్ముడికి కాల్ చేసింది. తాను లిఫ్ట్ చెయ్యకుండా కట్ చేశాడు. తమ్ముడు అలిగాడని గుర్తించిన అక్క.. పాత పద్ధతిలో తమ్ముడిని సర్ ప్రైజ్ చేసేందుకు సిద్ధమైంది. ఏకంగా 434 మీటర్ల పొడవున ఓ ఉత్తరం రాసి సంచలనం సృష్టించింది.
  ఆ అక్క కేరళకు చెందిన కృష్ణ ప్రియ. ఇంజనీరింగ్ చదువుతోంది.. సదరు తమ్ముడి పేరు కృష్ణ ప్రసాద్. ఇప్పుడీ అక్కా తమ్ముళ్ల ఉత్తరం వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముందు చిన్నగా రాద్దామనుకుని..

అలిగిన తమ్ముడిని సర్ ప్రైజ్ చేద్దామనుకున్న కృష్ణ ప్రియ.. మొదట ఓ ఏ4 సైజు పేపర్ తీసుకుని ఉత్తరం రాయడం మొదలుపెట్టింది. తమ్ముడంటే తనకు ఎంత ప్రేమో, తమ్ముడి కోసం తాను ఏమేం చేశానో, చిన్నప్పటి నుంచి ఎలా చూసుకున్నానో చెబుతూ.. అన్నీ రాయాలని సంకల్పించింది. ఇందుకోసం వరుసగా తెల్లకాగితాలు తెస్తూ రాయడం మొదలుపెట్టింది. మొత్తంగా 15 బండిల్స్ కొనుక్కొచ్చి రాసింది. అవన్నీ రాశాక.. ఒకదాని వెనుక ఒకటిగా అతికించి, ప్యాక్ చేసింది.

మొత్తంగా చూస్తే 434 మీటర్ల పొడవుతో ఉత్తరం తయారైంది. తమ్ముడికి పోస్టు చేద్దామని పోస్టాఫీసుకు వెళితే.. వారు దాన్ని తూకం వేసి 5 కిలోల 270 గ్రాముల బరువున్నట్టు తేల్చి.. ఆ మేరకు చార్జీ వేశారు. రెండు రోజుల తర్వాత తనకు చేరిన ఆ ఉత్తరాన్ని చూసి తమ్ముడు ఆశ్చర్యపోయాడు. తన మీద అక్కకున్న ప్రేమను చూసి సంబరపడుతూ.. స్నేహితులందరికీ చెప్పుకొన్నాడు. మరో విశేషం ఏమిటంటే.. ఇంత పెద్ద ఉత్తరాన్ని ‘వరల్డ్‌ లాంగెస్ట్‌ లెటర్‌’గా రికార్డు కోసం గిన్నిస్‌ బుక్ కు కృష్ణప్రియ దరఖాస్తు చేసుకుంది.



More Telugu News