చివరి ఓవర్ ఉమ్రాన్ కు ఎందుకు ఇచ్చిందీ వివరించిన పాండ్యా
- అతడి పేస్ బౌలింగ్ లో 18 పరుగులు చేయడం కష్టమన్న కెప్టెన్
- అయినా ఐర్లాండ్ క్రికెటర్లు మంచి షాట్స్ ఆడారని ప్రశంస
- అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చిందన్న పాండ్యా
ఐర్లాండ్ తో రెండో టీ20 మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా నడిచింది. భారత్ తొలుత 225 పరుగులు చేయగా.. ఐర్లాండ్ దాదాపు గెలిచినంత పనిచేసింది. కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఐర్లాండ్ విజయం కోసం చివరి ఓవర్ లో 17 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అటువంటి దశలో ధారాళంగా పరుగులు ఇస్తాడని పేరున్న ఉమ్రాన్ మాలిక్ కు కెప్టెన్ పాండ్యా బాధ్యతలు అప్పగించాడు. ఇలా ఎందుకు చేశాడన్న దానిపై మ్యాచ్ ముగిసిన తర్వాత పాండ్యా వివరించాడు.
"ఒత్తిడిని నా సమీకరణాలకు దూరంగా ఉండేలా నేను ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తుంటా. ఉమ్రాన్ కు మద్దతుగా నిలవాలని అనుకున్నాను. అతడి బౌలింగ్ కు వేగం ఉంది. అంత పేస్ బౌలింగ్ లో ఒక ఓవర్ కు 18 పరుగులు సాధించడం చాలా కష్టం. అయినా ఐర్లాండ్ ఆటగాళ్లు మంచి షాట్లు ఆడారు. మన బౌలర్లకూ క్రెడిట్ ఇవ్వాల్సిందే’’ అని పాండ్యా పేర్కొన్నాడు.
ఐర్లాండ్ లో ఆడడం గురించి మాట్లాడుతూ.. భారతీయ అభిమానుల నుంచి భారీ మద్దతు లభించినట్టు పాండ్యా చెప్పాడు. వారి అభిమాన క్రికెటర్లు దినేష్ కార్తీక్, సంజు శామ్సన్ గా పేర్కొన్నాడు. ‘‘అభిమానులకు చక్కని వినోదం ఇచ్చామని భావిస్తున్నాం. మాకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు’’ అని పాండ్యా ప్రకటించాడు. దేశానికి ఆడడం ఒక కలగా పేర్కొంటూ, దీపక్ హుడా, ఉమ్రాన్ మాలిక్ ను అభినందించాడు.