కోడికత్తి ఘటనతో రాష్ట్రాన్ని తగులబెట్టాలనుకున్నారు.. నన్ను బెదిరించిన ప్రజాప్రతినిధి నిన్న భోరున ఏడ్చాడు: ఏబీ వెంకటేశ్వరరావు

  • కోడికత్తి ఘటనతో చేయాలనుకున్న అల్లర్లను తాను అడ్డుకున్నానన్న ఏబీ 
  • నీ సంగతి చూస్తామంటూ నెల్లూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి బెదిరించాడని వెల్లడి 
  • నేను చేయగలిగింది న్యాయ పోరాటం లేదా ధర్మ పోరాటం మాత్రమేనని వ్యాఖ్య 
మరోసారి సస్పెండ్ అయిన ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎంతో మంది ఐపీఎస్ అధికారులు ఉండగా మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి ఘటనతో రాష్ట్రాన్ని తగులబెట్టాలనుకున్నారని... అయితే అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న తాను ఆ ఘటనలు జరగకుండా అడ్డుకున్నానని... అందువల్లే తనను టార్గెట్ చేశారని చెప్పారు. 

ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి అర్ధరాత్రి తనకు ఫోన్ చేసి... నీ సంగతి చూస్తామని బెదిరించాడని.. అర్ధరాత్రి సమయం కదా, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో అని తాను పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. కానీ, ఆ ప్రజాప్రతినిధే నిన్న భోరున ఏడ్చాడంటూ మీడియాలో వార్తలు వచ్చాయని ఎద్దేవా చేశారు. 

రిటైర్ అయ్యేంత వరకు ఖాకీ యూనిఫామ్ వేసుకోకుండా చేస్తామని మరో ప్రజాప్రతినిధి గతంలో తనను బెదిరించారని ఏబీవీ అన్నారు. ప్రస్తుతం తాను చేయగలిగింది న్యాయ పోరాటం లేదా ధర్మ పోరాటం మాత్రమేనని చెప్పారు. ఐపీఎస్ అధికారిగా బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి తాను వ్యవసాయం చేస్తూనే ఉన్నానని... పంటకు పట్టిన చీడపురుగులను ఏరివేస్తూనే ఉన్నానని చెప్పారు.


More Telugu News