మరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ.. డాలర్ కు రూ.78.83కి పతనం
- వరుసగా ఐదో రోజూ రూపాయికి నష్టం
- చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ భయాలే కారణం
- లిబియా, ఈక్వెడార్ దేశాల్లో అనిశ్చితితో భగ్గుమంటున్న చమురు ధరలు
డాలర్ తో మారకంలో రూపాయి మరో చారిత్రక కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. మంగళవారం డాలర్ తో పోలిస్తే ఏకంగా రూ.78.83కు పడిపోయింది. ఇలా రోజూ చారిత్రక కనిష్ఠ స్థాయికి తగ్గిపోవడం వరుసగా ఆరో రోజు కావడం గమనార్హం. సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి రూ.78.34 పైసల వద్ద రూపాయి విలువ నమోదవగా.. మంగళవారం ఉదయం మరింత కనిష్ఠంగా రూ.78.53 పైసల వద్ద మొదలైంది. చివరికి రూ.78.83 పైసల వద్ద ముగిసింది. సోమవారంతో పోలిస్తే 46 పైసలు పడిపోవడం గమనార్హం.
చమురు ధరలు, మార్కెట్లే కారణం..
క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో.. నిత్యావసరాల ధరలు పెరగవచ్చని, భవిష్యత్తులో సుదీర్ఘకాలం ద్రవ్యోల్బణం కొనసాగవచ్చన్న అంచనాలతో రూపాయి పతనమవుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు విదేశీ మదుపరులు సొమ్మును వెనక్కి తీసుకుంటుండటం, స్టాక్ మార్కెట్లు పడిపోతుండటం వంటివీ డాలర్లకు డిమాండ్ పెంచుతున్నాయని అంటున్నారు.
భగ్గుమంటున్న చమురు ధరలు
లిబియా, ఈక్వెడార్ దేశాల్లో రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో చమురు ఉత్పత్తి, సరఫరాలు అనిశ్చితిలో పడ్డాయని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. సౌదీ, యూఏఈ చమురు ఉత్పత్తి పెంచే అవకాశాలు లేవన్న ప్రచారం దీనికి తోడై చమురు ధరలు భగ్గుమంటున్నాయని పేర్కొంటున్నాయి.