ముంబయికి తిరిగొచ్చేయండి... నాతో మాట్లాడండి: రెబెల్ ఎమ్మెల్యేలకు సీఎం ఉద్ధవ్ థాకరే లేఖ

  • మహారాష్ట్రలో కొనసాగుతున్న సంక్షోభం
  • అందరం కలిసి చర్చిద్దామన్న సీఎం థాకరే
  • రెబెల్ ఎమ్మెల్యేలకు పిలుపు
  • మీరు ఇప్పటికీ శివసైనికులేనని వ్యాఖ్యలు
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నిలకడగా కొనసాగుతోంది. తాము గువాహటి నుంచి ముంబయికి వస్తున్నామని రెబెల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్ నాథ్ షిండే ప్రకటించినప్పటికీ, అదేమీ సంక్షోభ నివారణ చర్య కాదని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే స్పందించారు. "ముంబయికి తిరిగొచ్చేయండి... నాతో మాట్లాడండి. మనం ఓ పరిష్కారం కనుగొందాం. మీలో చాలామంది మాతో టచ్ లో ఉన్నారు" అంటూ రెబెల్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు థాకరే వారికి లేఖ రాశారు. 

"గత కొన్నిరోజులుగా మీరు గువాహటిలో చిక్కుకుపోయారు. ప్రతి రోజు మీకు సంబంధించిన కొత్త విషయం బయటికి వస్తోంది. మీరు ఇప్పటికీ శివసేన హృదయంలో ఉన్నారు. మీ కుటుంబ సభ్యులు నా వద్దకు వచ్చి తమ భావోద్వేగాలను వ్యక్తం చేశారు. శివసేన కుటుంబ పెద్దగా చెబుతున్నాను... మీ మనోభావాలను గౌరవిస్తాను. ముందు మీరు అయోమయాన్ని వీడండి... ఏ సమస్యకైనా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. కలిసి కూర్చుని చర్చించుకుందాం రండి. 

ఒకరి తప్పు కారణంగా మీరు ఉచ్చులో చిక్కుకోవద్దు. శివసేన ఇస్తున్న గౌరవం మీకు మరెక్కడా లభించదు. మీరు ముందుకొచ్చి మాట్లాడితే ఒక మార్గం అంటూ ఏర్పడుతుంది. శివసేన కుటుంబ పెద్దగా మీ పట్ల ఇప్పటికీ ఆందోళన చెందుతున్నాను. వచ్చేయండి... అందరం కలిసి ఆస్వాదిద్దాం" అంటూ ఉద్ధవ్ థాకరే తన లేఖలో పేర్కొన్నారు.


More Telugu News