క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యా... నాటో వైపు చూస్తున్న ఉక్రెయిన్

  • మూడు వారాల తర్వాత కీవ్ పై దాడులు
  • ఒక్కరోజే 14 క్షిపణులు ప్రయోగించిన రష్యా
  • తమకు మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలు కావాలన్న జెలెన్ స్కీ
  • లేకపోతే రష్యాను ఎదుర్కోలేమని స్పష్టీకరణ
ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై ఒక్కరోజే రష్యా 14 క్షిపణులను సంధించడం ద్వారా దాడుల్లో తీవ్రతను మరింత పెంచింది. కీవ్ లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ రష్యా క్షిపణి దాడిలో నేలమట్టమైంది. ఈ దాడిలో పలువురు మృతి చెందినట్టు భావిస్తున్నారు. మూడు వారాల తర్వాత కీవ్ పై రష్యా దాడి చేయడం ఇదే ప్రథమం. కాగా, రష్యా భీకర క్షిపణి దాడులతో ఉక్రెయిన్ రాజధాని తల్లడిల్లుతోంది. 

ఈ నేపథ్యంలో, తమకు  క్షిపణి రక్షణ వ్యవస్థలు కావాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్ బెర్గ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనతో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. రష్యా క్షిపణిదాడులను తిప్పికొట్టాలంటే శక్తిమంతమైన మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలు అవసరమని జెలెన్ స్కీ పేర్కొన్నారు. 

అటు, జీ7 దేశాల సదస్సులోనూ ఉక్రెయిన్ అంశం చర్చకు వచ్చింది. ఐదు అభివృద్ధి చెందుతున్న దేశాలు రష్యా చేపట్టిన సైనికచర్యను 'అక్రమ యుద్ధం'గా అభివర్ణిస్తూ తీర్మానం చేశాయి. అంతేకాదు, మాడ్రిడ్ లో జరిగే నాటో సమావేశంలో ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర పర్యవసానాలపై నేతలు చర్చించనున్నారని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వెల్లడించింది. ఉక్రెయిన్ యుద్ధం ముగిశాక యూరప్ భద్రతకు రష్యా పెనుముప్పుగా పరిణమించే అవకాశం ఉందని బ్రిటన్ ఆర్మీ చీఫ్ పాట్రిక్ శాండర్స్ ఆందోళన వ్యక్తం చేశారు.


More Telugu News