221 యాప్స్​ ను తొలగించాలని గూగుల్​కు సైబర్​ క్రైం పోలీసులు లేఖ.. ఏం యాప్స్​ అంటే..

  • లోన్ యాప్స్ పై వచ్చిన ఫిర్యాదులపై పోలీసుల లోతైన విచారణ
  • ప్రజలను ఇబ్బంది పెడుతున్న 221 యాప్స్ గుర్తింపు
  • వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించాలని గూగుల్ కు లేఖ
ఒకప్పుడు అప్పు కావాలంటే తెలిసినవాళ్లను అడిగేవారు. లేదంటే ఏదైనా కుదువ పెట్టి బ్యాంకులో లోన్ తీసుకునే వారు. కానీ, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. అన్ని సౌకర్యాలతో పాటు అప్పు కూడా క్షణాల్లో పుడుతోంది. తక్షణమే అప్పు ఇచ్చేందుకు నెట్ లో వేల సంఖ్యలో లోన్ యాప్స్ ఉన్నాయి. వాటిని  డౌన్ లోడ్ చేసుకుంటే చాలు క్షణాల్లో డబ్బులు ఖతాలో జమ అవుతాయి. ఇప్పుడు యాప్స్ లో అప్పు తీసుకునేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. 

ముఖ్యంగా చిన్నచిన్న అవసరాల కోసం యాప్స్ లో అప్పు తీసుకునే వారు ఎక్కువ అవుతున్నారు. అలాంటి వారి అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న లోన్ యాప్స్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. తీసుకున్న అప్పు చెల్లించకపోతే బెదిరింపులకు దిగుతున్నారు. వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. లోన్ తీసుకునే సమయంలో ఇచ్చే వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. యాప్ ద్వారా మొబైల్ లోకి చొరబడి అసలు, వడ్డీ చెల్లించని వారి బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. అప్పులు తీసుకున్న మహిళల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి వారి పరువు తీసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

లోన్ యాప్స్ నిర్వాహకుల వేధింపుల కారణంగా పలువురు ఆత్మహత్య చేసుకోగా.. మరికొందరు వాళ్లు అడినంత ఇస్తున్నారు. ఇలాంటి యాప్స్ పై పోలీసులకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు లోన్ యాప్స్ పై లోతైన విచారణ జరుపుతున్నారు. అమాయకులను మోసం చేసి, వేధిస్తున్న 221 లోన్ యాప్ లను గుర్తించారు. వాటిని తొలగించాలని గూగుల్ కు లేఖ రాశారు. ఇలాంటి లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.


More Telugu News