నేడు ఐర్లాండ్ తో భారత్ రెండో టీ20.. వాన దేవుడు కరుణిస్తేనే ఆట

  • తొలి మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపు 
  • రెండో మ్యాచ్ లో శాంసన్, త్రిపాఠి, అర్షదీప్ లకు అవకాశం ఇచ్చే యోచన
  • రాత్రి 9 గంటల నుంచి మ్యాచ్
తొలి మ్యాచ్‌‌‌‌లో ఐర్లాండ్‌‌‌‌పై ఘన విజయం సాధించిన హార్దిక్‌‌‌‌ పాండ్యా కెప్టెన్సీలోని భారత జట్టు రాత్రి జరిగే రెండో, చివరి టీ20లో గెలిచి సిరీస్ దక్కించుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. అదే సమయంలో ఈ మ్యాచ్ లో మరికొందరు ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని చూస్తోంది. ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20లో భారత్ ఏడు వికెట్లతో ఐర్లాండ్‌‌‌‌ను ఓడించింది. 12 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో ఐర్లాండ్‌‌‌‌ ఇచ్చిన 109 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్‌‌‌‌గా వచ్చిన దీపక్‌‌‌‌ హుడా భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. గాయం వల్ల యువ ‌‌ఓపెనర్‌‌‌‌ రుతురాజ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌కు రాలేదు. అతని స్థానంలో ఈ మ్యాచ్‌‌‌‌లో సంజూ శాంసన్‌ లేదా రాహుల్ త్రిపాఠికి తుది జట్టులో అవకాశం రానుంది. గత ఐపీఎల్ లో ఈ ఇద్దరూ మంచి ఫామ్ కనబరిచారు.

ఇక, ఐపీఎల్‌‌‌‌లో అయిన గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన మిడిలార్డర్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ సూర్య కుమార్‌‌‌‌ తొలి టీ20లో డకౌటై నిరాశ పరిచాడు. ఈ నేపథ్యంలో రెండో పోరులో ఎలాగైనా బ్యాట్ ఝుళిపించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఇక, తన అరంగేట్రం మ్యాచ్ లో యువ పేసర్‌‌‌‌ ఉమ్రాన్‌‌‌‌ మాలిక్‌‌‌‌ ఎక్కువ పరుగులు ఇచ్చుకున్నాడు. అయినప్పటికీ అతనిపై కెప్టెన్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ భరోసా ఉంచాడు.   ఉమ్రాన్ ఈ మ్యాచ్‌‌‌‌లోనూ ఆడటం ఖాయమే కాబట్టి దాన్ని అతను సద్వినియోగం చేసుకోవాలి. 

ఇక, తొలి మ్యాచ్‌‌‌‌ లో నిరాశ పరిచిన అవేశ్‌‌‌‌ ఖాన్ స్థానంలో మరో యువ పేసర్ అర్షదీప్‌‌‌‌ను బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ లో పంజాబ్ తరఫున అతను ఆకట్టుకున్నాడు. మరోవైపు తొలి మ్యాచ్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌లో రాణించిన ఐర్లాండ్‌‌‌‌ ఈసారి బౌలింగ్ లోనూ సత్తా చాటి సిరీస్‌‌‌‌ సమం చేయాలని అనుకుంటోంది. ఇక తొలి మ్యాచ్ మాదిరిగానే రెండో టీ20కి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ సజావుగా జరుగుతుందో లేదో చూడాలి.


More Telugu News