క్రికెట్‌కు ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గుడ్‌ బై.. నేడు ప్రకటించే అవకాశం!

  • అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోనున్న మోర్గాన్
  • ఏడున్నర సంవత్సరాలపాటు పరిమిత ఓవర్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన మోర్గాన్
  • అతడి సారథ్యంలోనే జట్టుకు వన్డే ప్రపంచకప్
  • గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో తంటాలు
  • జోస్ బట్లర్‌కు పగ్గాలు అప్పగింత!
ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు నేడు తన రిటైర్మెంట్‌ను ప్రకటించనున్నట్టు సమాచారం. దాదాపు ఏడున్నర సంవత్సరాలపాటు స్కిప్పర్‌గా వ్యవహరించిన మోర్గాన్ త్వరలోనే ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లోనూ ఆడాలని అనుకున్నాడు. అయితే, గత కొంతకాలంగా పేలవ ఫామ్, ఫిట్‌నెస్ లేమితో తంటాలు పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత 28 ఇన్నింగ్స్‌లలో రెండు అర్ధ సెంచరీలు మాత్రమే చేయడం గతి తప్పిన ఫామ్‌కు నిదర్శనం.

2014లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న మోర్గాన్ జట్టును అద్వితీయంగా ముందుకు నడిపించాడు. వన్డే, టీ20ల్లో జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. అతడి సారథ్యంలోని జట్టు 2019లో వన్డే ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుంది.

126 వన్డేలు, 72 టీ20లకు సారథ్యం వహించిన 35 ఏళ్ల మోర్గాన్ 248 వన్డేల్లో 7,701 పరుగులు చేశాడు. 115 టీ20ల్లో 2,458 పరుగులు చేశాడు. 16 టెస్టు మ్యాచ్‌లకు కూడా మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2012లో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. కెప్టెన్సీ నుంచి మోర్గాన్ తప్పుకోనుండడంతో అతడి స్థానంలో వైస్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కూడా మోర్గాన్ సారథ్యం వహించాడు. అంతకుముందు సీజన్‌లో అతడు ఘోరంగా విఫలం కావడంతో ఫ్రాంచైజీ అతడిని వదులుకుంది. ఈసారి వేలంలో అతడు అన్‌సోల్డ్ ఆటగాడిగా మిగిలిపోయాడు.


More Telugu News