ఇది వినడానికే సిగ్గుగా ఉంది: విజయశాంతి

  • ప్రభుత్వ వైద్య రంగంపై విజయశాంతి వ్యాఖ్యలు
  • ఐఐపీఎస్ సర్వే ప్రస్తావన
  • ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శలు
  • తెలంగాణ చివరి నుంచి నాలుగోస్థానంలో ఉందని వెల్లడి
తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 36.2 శాతం మంది మాత్రమే ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకుంటున్నారని ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పాప్యులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్) సర్వే వెల్లడిస్తోందని వివరించారు. మిగతా 63.8 శాతం మంది చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులకే వెళుతున్నారని తెలిపారు. 

దేశంలో సగం మంది (49.9 శాతం) ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకే వెళుతుండగా, తెలంగాణ రాష్ట్రం దేశ సగటు కంటే వెనుకబడి ఉందని ఐఐపీఎస్ సర్వే చెబుతోందని విజయశాంతి పేర్కొన్నారు. దేశం మొత్తమ్మీద తెలంగాణ రాష్ట్రం చివరి నుంచి నాలుగో స్థానంలో ఉందని, ఇది వినడానికే సిగ్గుగా ఉందని అభిప్రాయపడ్డారు. కనీసం పేదలకైనా వైద్యం అందించలేని ఈ సర్కారు ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజానీకం గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని విజయశాంతి స్పష్టం చేశారు.


More Telugu News