ఐర్లాండ్ యువ ఆటగాడికి తన బ్యాట్ కానుకగా ఇచ్చిన హార్దిక్ పాండ్యా

  • డబ్లిన్ లో టీమిండియా, ఐర్లాండ్ టీ20
  • విజయం సాధించిన టీమిండియా
  • అందరినీ ఆకట్టుకున్న ఐర్లాండ్ యువ కిశోరం టెక్టర్
  • 33 బంతుల్లోనే 64 పరుగులు చేసిన వైనం
డబ్లిన్ లో నిన్న జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఐర్లాండ్ పై టీమిండియా అలవోకగా విజయం సాధించింది. అయితే, ఐర్లాండ్ యువ ఆటగాడు హ్యారీ టెక్టర్ దూకుడుగా ఆడి ఐర్లాండ్ స్కోరు 100 పరుగులు దాటడంలో కీలకపాత్ర పోషించాడు. టెక్టర్ 33 బంతుల్లో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ నిర్ణీత 12 ఓవర్లలో 108 పరుగులు స్కోరు చేయగలిగిందంటే అది టెక్టర్ చలవే. 

టెక్టర్ వయసు 22 ఏళ్లు. టీమిండియా వంటి అగ్రశ్రేణి జట్టుపై అతడు ఎలాంటి భయంలేకుండా ఆడిన తీరు అభిమానులనే కాదు, టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కూడా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో, పాండ్యా తన బ్యాట్ ను హ్యారీ టెక్టర్ కు కానుకగా అందించాడు. మీడియా సమావేశంలో దీనిపై పాండ్యా వివరణ ఇచ్చాడు.

టెక్టర్ వయసు 22 ఏళ్లేనని, తమపై మ్యాచ్ లో అద్భుతమైన షాట్లు ఆడాడని కొనియాడాడు. తను ఇంకెన్నో భారీ షాట్లు కొట్టాలని, ఐపీఎల్ లోనూ కాంట్రాక్టు అందుకుంటాడని ఆశిస్తున్నానని పాండ్యా తెలిపాడు. టెక్టర్ ఎంతో ప్రతిభావంతుడని, ఇలాంటి ఆటగాడిని ఐర్లాండ్ క్రికెట్ జట్టు మేనేజ్ మెంట్ ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని, అతడు ఐపీఎల్ లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెట్ లీగ్ ల్లో రాణిస్తాడని వ్యాఖ్యానించాడు.


More Telugu News