పారా మిలిటరీ బలగాలను సిద్ధంగా ఉంచండి... కేంద్రాన్ని కోరిన మహారాష్ట్ర గవర్నర్

  • మహారాష్ట్రలో మరింత ముదిరిన సంక్షోభం
  • 8 మంత్రులపై 'మహా' సర్కార్ వేటు 
  • రెబెల్స్ నివాసాలపై దాడులు జరగొచ్చంటూ నివేదికలు
  • అప్రమత్తమైన గవర్నర్ కొష్యారీ 
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. 8 మంది రెబెల్ మంత్రులపై సీఎం ఉద్ధవ్ థాకరే వేటు వేయడంతో అసమ్మతివర్గంతో సయోధ్య సాధ్యం కాదని తేలిపోయింది. అటు, థాకరే కుటుంబాన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేస్తున్న రెబెల్ ఎమ్మెల్యేల నివాసాలు, కార్యాలయాలపై దాడులు జరగొచ్చన్న నివేదికల నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కొష్యారీ అప్రమత్తం అయ్యారు. 

రాష్ట్రంలో హింసాత్మక ఘటనల నివారణకు పారా మిలిటరీ బలగాలను సిద్ధంగా ఉంచాలని కేంద్రాన్ని కోరారు. పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. ఇటీవల రెబెల్ ఎమ్మెల్యేలకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించడం తెలిసిందే. తాజాగా శివసేన నేతలు ఆగ్రహావేశాలతో ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో, ఏ క్షణమైనా శివసేన శ్రేణులు రెచ్చిపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, గవర్నర్ మహారాష్ట్ర డీజీపీ రాజేష్ సేథ్ కు లేఖ కూడా రాశారు. 

కొందరు ఎమ్మెల్యేలు, వారి నివాసాలు, కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత కల్పించాలని లేఖలో కోరారు. తమ కుటుంబాలకు చట్టవిరుద్ధంగా భద్రత తొలగించారంటూ శివసేన నుంచి 38 మంది ఎమ్మెల్యేలు, ప్రహార్ జన్ శక్తి పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల తరఫున విజ్ఞప్తులు అందాయని గవర్నర్ కొష్యారీ వెల్లడించారు.


More Telugu News