నా తల తీసేసినా సరే.. నేను గువాహటి మార్గంలోకి వెళ్లను: ఈడీ సమన్లపై సంజయ్ రౌత్ స్పందన

  • ఈడీ సమన్లు ఇవ్వడం మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మలుపు అన్న సంజయ్ రౌత్
  • తనను నిలువరించేందుకు చేసిన కుట్ర అని మండిపాటు
  • కావాలంటే తనను అరెస్ట్ చేయాలంటూ వ్యాఖ్య
శివసేన కీలక నేత సంజయ్ రౌత్ కు మనీ లాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణ కోసం రేపు తమ కార్యాలయానికి రావాలని సమన్లలో ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ స్పందిస్తూ... తనకు ఈడీ సమన్లు జారీ చేసిందని ఇప్పుడే తెలిసిందని చెప్పారు. 

'చాలా మంచిది. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద మలుపు. బాలాసాహెబ్ శివసైనికులైన మేము ఒక పెద్ద యుద్ధం చేస్తున్నాం. ఈడీ సమన్లు ఇవ్వడం నన్ను నిలువరించేందుకు చేసిన ఒక కుట్ర. మీరు నా తల తీసేసినా సరే.. నేను గువాహటి మార్గంలోకి వెళ్లను. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి. జైహింద్' అని ట్వీట్ చేశారు. 

రూ. 1,034 కోట్ల పాత్రా చాల్ భూకుంభకోణానికి సంబంధించిన కేసులో సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ నెలలో సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్, మరో ఇద్దరికి చెందిన రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. శివసేనలో సంక్షోభం ముదురుతున్న సమయంలో సంజయ్ కు ఈడీ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు అసోంలోని గువాహటిలో క్యాంపు వేసిన సంగతి తెలిసిందే. అందుకే... ఒత్తిడి తెచ్చినా తాను గువాహటి మార్గం (రెబెల్స్)లోకి వెళ్లనని సంజయ్ అన్నారు.


More Telugu News