20 ఏళ్ల తర్వాత రష్యాకు అత్యంత గడ్డు స్థితి!

  • విదేశీ రుణ చెల్లింపుల్లో విఫలమైన రష్యా
  • 100 మిలియన్ డాలర్ల చెల్లింపులకు గడువు మే 27
  • యూరో క్లియర్ బ్యాంకులో చిక్కుకుపోయన వైనం
  • పాశ్చాత దేశాల ఆంక్షల వల్లేనన్న రష్యా
  • చెల్లింపులకు సరిపడా డబ్బులు ఉన్నాయని ప్రకటన
ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా చెప్పుకునే రష్యా.. రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారి విదేశీ రుణాలను (సావరీన్ డెట్) చెల్లించలేకపోయింది. తమ దగ్గర చెల్లింపులకు తగినన్ని నిల్వలు ఉన్నాయంటూ రష్యా ప్రకటన విడుదల చేసింది. పాశ్చాత్య ప్రపంచం తన చెల్లింపు మార్గాలను నిలిపివేసి బలవంతంగా అడ్డుకోవడం వల్ల చెల్లింపులు సాధ్యపడలేదని వివరణ ఇచ్చింది. ‘‘మా దగ్గర డబ్బులు ఉన్నాయి. చెల్లించేందుకూ సిద్ధమే’’ అని ప్రకటించింది. 

మే 27న 100 మిలియన్ డాలర్ల వడ్డీని చెల్లించాల్సిన రష్యా.. ఆ మొత్తాన్ని యూరోక్లియర్ అనే బ్యాంకుకు పంపించినట్టు తెలిపింది. బ్యాంకు రుణదాతలకు పంపిణీ చేయాల్సి ఉందని పేర్కొంది. అక్కడ డబ్బులు చిక్కుకుపోయినట్టు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలు పెట్టిన తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో రష్యా అనుసంధానం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఒక స్నేహ రహిత దేశం కృత్రిమంగా సృష్టించిన పరిస్థితి ఇదని.. రష్యన్ల జీవితాలపై ఇదేమీ ప్రభావం చూపించలేదని ఆ దేశ ఆర్థిక మంత్రి ఆంటోన్ సిలునోవ్ ఇటీవలే ఓ సందర్భంలో పేర్కొన్నారు. రష్యా 40 బిలియన్ డాలర్ల మేర విదేశీ రుణాలను బాండ్ల రూపంలో తీసుకుంది. రష్యా దగ్గర దండిగా విదేశీ మారక నిల్వలు, బంగారం నిల్వలు ఉన్నాయి. కానీ ఏం లాభం..? అవన్నీ విదేశాల్లోనే ఉండడంతో అక్కడ స్తంభనకు గురయ్యాయి. చివరిగా రష్యా 1998లోనూ రూబుల్ పతనంతో విదేశీ రుణ చెల్లింపుల్లో విఫలమైంది. అంతర్జాతీయ సాయంతో నాడు గట్టెక్కింది.


More Telugu News