ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీఆర్​.. నేడు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్​ సిన్హా నామినేషన్​కు హాజరు

  • కేటీఆర్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన టీఆర్ ఎస్ ఎంపీలు
  • సిన్హా నామినేషన్ పేపర్లపై సంతకం చేయనున్న ఎంపీలు
  • నామినేషన్ తర్వాత కేంద్ర మంత్రులను కేటీఆర్ కలిసే అవకాశం
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌ ఢిల్లీ వెళ్లారు. సోమవారం ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌‌ సిన్హా నామినేషన్‌‌ కార్యక్రమానికి టీఆర్‌‌ఎస్‌‌ ప్రతినిధిగా ఆయన హాజరు అవుతారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. యశ్వంత్ సిన్హాకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి సిన్హా నామినేషన్ కార్యక్రమానికి తాను హాజరవుతానని ట్వీట్ చేశారు.

ఈ క్రమంలో ఆదివారం రాత్రే కేటీఆర్‌‌ తో పాటు టీఆర్ఎస్ ఎంపీలూ ఢిల్లీ చేరుకున్నారు. సిన్హా నామినేషన్‌‌ పేపర్లపై టీఆర్ఎస్ ఎంపీలు సంతకాలు చేయనున్నారు. అనంతరం పార్లమెంట్‌‌ కార్యదర్శి చాంబర్‌‌లో సిన్హా నామినేషన్‌‌ కార్యక్రమంలో కేటీఆర్‌‌ పాల్గొంటారు. కాగా, సిన్హా నామినేషన్‌‌‌‌ అనంతరం అవకాశం ఉంటే కేంద్ర మంత్రులను కేటీఆర్ కలుస్తారని సమాచారం. లేదంటే వెంటనే హైదరాబాద్‌‌‌‌కు తిరిగి వచ్చేస్తారని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు చెబుతున్నారు. 

రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌, బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దించాలని మొదట్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రతిపాదించారు. అయితే పశ్చిమ బెంగాల్‌‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కాంగ్రెస్‌‌‌‌ సహా అనేక ప్రాంతీయ పార్టీలు కలిసి యశ్వంత్‌‌‌‌ సిన్హాను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. కాంగ్రెస్ ఉండటంతో విపక్షాలకు మద్దతివ్వకూడదని మొదట్లో టీఆర్ఎస్ భావించింది. కానీ, సీఎం కేసీఆర్‌‌‌‌కు ఎన్సీపీ అధినేత‌‌‌ శరద్‌‌‌‌ పవార్‌ ‌‌‌ఫోన్‌‌‌‌ చేసి సిన్హాకు మద్దతివ్వాలని కోరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌ లేకుండా పోటీకి దిగితే ప్రయోజనం ఉండదని ఆయనకు వివరించారు. పవార్‌‌‌‌ మధ్యవర్తిత్వంతో సిన్హాకు మద్దతు ఇచ్చేందుకు కేసీఆర్‌‌‌‌ అంగీకరించారు.  

అదే సమయంలో అటు ఎన్డీఏకు దూరంగా ఉండి.. ఇటు విపక్షాలను కాదని జాతీయ స్థాయిలో ఒంటరి కావొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌‌‌‌ సిన్హాకు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్గాలు చెప్తున్నాయి. జాతీయ పార్టీ ఏర్పాటు చేసినా భావసారూప్య పార్టీలు తమతో కలిసి వచ్చేందుకు రాష్ట్రపతి ఎన్నికలను వేదికగా చేసుకోవాలని కేసీఆర్‌‌‌‌ భావిస్తున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.


More Telugu News