తెలుగులో బోర్డు పెట్టుకుంటే నాకు సుప్రీంకోర్టు సీజే పదవి రాదన్నారు.. అయినా దానికి సిద్ధపడ్డా!: జస్టిస్ ఎన్వీ రమణ

  • తెలుగు వాళ్లు ఎక్కడికి వెళ్లినా తెలుగులోనే మాట్లాడుకోవాలన్న సీజే
  • మట్టివాసనను, మాతృభాషను, తల్లిదండ్రులను మరవొద్దని సూచన
  • వాషింగ్టన్ డీసీలో ప్రవాస భారతీయుల ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్వీ రమణ 
తెలుగు వాళ్లు ప్రపంచంలో ఎక్కడ స్థిరపడ్డా తెలుగులోనే మాట్లాడుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. పిల్లలకు మాతృభాష, ప్రథమ భాషగా తెలుగులో విద్యాబోధన సాగాలన్నారు. తెలుగులో ఉత్తరాలు రాసే సంప్రదాయాన్ని కొనసాగించాలని సూచించారు. నేను తెలుగు వాడిని అని సగర్వంగా చెప్పే పరిస్థితి తెచ్చుకోవాలన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రమణ.. వాషింగ్టన్ డీసీలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 

తెలుగువారు ఏ దేశానికి వెళ్లినా తమ మూలాలను, మాతృ భాషను, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోవద్దని కోరారు. పుట్టిన మట్టి వాసనను, తల్లిదండ్రులను మరవొద్దని ప్రవాస భారతీయులకు సూచించారు. బంధుమిత్రులు, విద్య నేర్పిన గురువులను ఏడాదికి ఒక్కసారైనా స్వయంగా కలిసి మాట్లాడితే లభించే సంతృప్తి వేరుగా ఉంటుందన్నారు. 

ప్రతి తెలుగు వ్యక్తి తన మాతృభాష తెలుగు అని గర్వంగా చెప్పుకోవాలని సూచించారు.  ఢిల్లీలో తనకు ఎదురైన సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఢిల్లీలో తన బంగ్లాకు తెలుగులో నామ ఫలకం పెట్టమని అడిగితే సిబ్బంది అవి లేవన్నారని చెప్పారు. విషయం తెలుసుకున్న ఓ కాంగ్రెస్ మంత్రి తెలుగులో ఓ బోర్డు రాయించి పంపించారని వెల్లడించారు.

అయితే, ఓ రోజు తన ఇంటికి వచ్చిన సుప్రీం సీనియర్ న్యాయమూర్తి ఒకరు తెలుగులో బోర్డు ఉండటం మంచిది కాదు తీసేయమని చెప్పారని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావాలంటే ఇలా చేయడం మంచిది కాదంటూ సలహా ఇచ్చారని, తాను మాత్రం రాజీ పడలేదన్నారు. మాతృ భాషలో నామ ఫలకం ఉన్నంత మాత్రాన ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కదంటే అందుకు తాను సిద్ధపడ్డానని ఎన్వీ రమణ వెల్లడించారు. ఇప్పుడు కూడా తన నివాసం ముందు ఇంగిష్ తో పాటు తెలుగు భాషలో కూడా తన పేరు రాసి ఉంటుందని చెప్పారు.


More Telugu News