గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమః'

  • దీపక్ రెడ్డి దర్శకత్వంలో 'మనసానమః' షార్ట్ ఫిలిం
  • పలు చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శనలు
  • రికార్డుస్థాయిలో 513 అవార్డులు
  • మరే షార్ట్ ఫిలింకు లభించని ఘనత
వినూత్న టెక్నిక్ తో తెరకెక్కిన తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమః' గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు పొందిన షార్ట్ ఫిలింగా 'మనసానమః' గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. యువ దర్శకుడు దీపక్ రెడ్డి తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా వివిధ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై 513 అవార్డులు అందుకుంది. ఇప్పటివరకు మరే లఘు చిత్రం ఇన్ని అవార్డులు సొంతం చేసుకోలేదు. 'మనసానమః' వరల్డ్ రికార్డును గిన్నిస్ బుక్ నిర్వాహకులు నిర్ధారిస్తూ చిత్రబృందానికి సర్టిఫికెట్ అందజేశారు. 

'మనసానమః' షార్ట్ ఫిలింలో విరాజ్ అశ్విన్, దృషిక చందర్, వల్లీ రాఘవేందర్, పృథ్వి శర్మ తదితరులు నటించారు. ఓ యువకుడు ముగ్గురు అమ్మాయిలతో వేర్వేరుగా ప్రేమలో పడడాన్ని ఈ షార్ట్ ఫిలింలో చూపించారు. ఈ మూడు ప్రేమ కథలు ముగింపు సీన్ నుంచి మొదలై ప్రారంభంతో ముగుస్తాయి. ఈ టెక్నిక్ కారణంగానే 'మనసానమః' షార్ట్ ఫిలింకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. యంగ్ డైరెక్టర్ దీపక్ రెడ్డికి టాలీవుడ్ లో మంచి భవిష్యత్ ఉందని విమర్శకుల ప్రశంసలు లభించాయి.


More Telugu News