'పంచాంగం' వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన నటుడు మాధవన్

  • ఇస్రో ప్రయోగాలకు పంచాంగంతో లింకు పెట్టిన మాధవన్
  • అంగారక యాత్ర పంచాంగం వల్లే విజయవంతమైందని వెల్లడి
  • ట్రోల్ చేసిన నెటిజన్లు
  • తనది అజ్ఞానమేననన్న మాధవన్
ఇస్రో రాకెట్ ప్రయోగాలకు, హిందూ పంచాంగం క్యాలెండర్ కు ముడేసిన నటుడు మాధవన్ తన వ్యాఖ్యల పట్ల విమర్శలు వస్తుండడంపై స్పందించారు. భారత్ చేపట్టిన అంగారక యాత్ర పంచాంగం ప్రకారం నిర్దేశించిన ముహూర్తం వల్లే సక్సెస్ అయిందని మాధవన్ ఇటీవల తమిళంలో ప్రసంగిస్తూ వ్యాఖ్యానించారు. దాంతో, నెటిజన్లు అతడిని తూర్పారబట్టారు. సైన్స్ తెలియకపోతే మాట్లాడకుండా ఉండొచ్చు కదా అని ట్రోల్ చేశారు. 

దీనిపై మాధవన్ ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. అయితే ఇక్కడ మాధవన్ తమిళ భాష అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు.

"పంచాంగాన్ని 'పంచాంగ్' అంటూ తమిళంలో చెప్పే ప్రయత్నం చేసినందుకు ఈ విమర్శలు రావడంలో తప్పులేదు. నాది అజ్ఞానమే. ఈ విమర్శల తాకిడికి నేను అర్హుడ్నే. అయితే మార్స్ మిషన్ కేవలం 2 ఇంజిన్ల సాయంతోనే విజయవంతం అయ్యిందన్న వాస్తవాన్ని ఈ వ్యవహారం దాచలేదు. ఇదొక రికార్డు కూడా. నంబి రూపొందించిన వికాస్ ఇంజిన్ ఓ రాక్ స్టార్" అని మాధవన్ వివరించారు. 

మాధవన్ ప్రస్తుతం భారత అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితం ఆధారంగా 'రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్' అనే చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే పంచాంగం వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు.


More Telugu News