ఇది బీజేపీ చిల్లర రాజకీయాలకు ఎదురుదెబ్బ: కేజ్రీవాల్
- ఉప ఎన్నికలో ఆప్ విజయం అనంతరం కేజ్రీవాల్ ప్రకటన
- ఢిల్లీలోని రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
- కార్యకర్తలు, పార్టీ శ్రేణులను అభినందించిన కేజ్రీవాల్
బీజేపీ చిల్లర రాజకీయాలను ప్రజలు ఓడించారని.. ఇది సరైన ఎదురుదెబ్బ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థి దుర్గేశ్ పాఠక్ విజయం సాధించిన అనంతరం ఆయన ఈ అంశంపై హిందీ, ఇంగ్లిష్ లలో పలు ట్వీట్లు చేశారు. ఆప్ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.
‘‘రాజిందర్ నగర్ ప్రజలకు నేను హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మాపై ఇంత ప్రేమ చూపిన ఢిల్లీ ప్రజలకు రుణపడి ఉంటాను. కష్టపడి పనిచేసి, ఉత్తమ సేవలు అందించేందుకు మాకు ఇది స్ఫూర్తిని ఇస్తుంది. బీజేపీ నేతల చిల్లర, చెత్త రాజకీయాలను ప్రజలు ఓడించారు. మంచిని గెలిపించారు. థాంక్ యూ రాజిందర్ నగర్, థాంక్ యూ ఢిల్లీ” అని తన ట్వీట్ లలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఢిల్లీలోని రాజిందర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థి పాఠక్ కు 40,319 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి భాటియాకు 28,851 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ లతకు కేవలం 2,014 ఓట్లు పోలయ్యాయి. ఆప్ అభ్యర్థి 11,468 ఓట్లతో విజయం సాధించారు.