మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి గెలుపు... ఉప ఎన్నిక‌లో వైసీపీ ఘ‌న విజ‌యం

  • 15వ రౌండ్‌కే 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన విక్ర‌మ్ రెడ్డి
  • మొత్తంగా 82,888 ఓట్ల మెజారిటీతో ఘ‌న విజ‌యం
  • డిపాజిట్ కోల్పోయిన బీజేపీ అభ్య‌ర్థి భ‌ర‌త్ కుమార్‌
నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో అధికార పార్టీ వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది. వైసీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి సోద‌రుడు మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన భ‌ర‌త్ కుమార్‌పై మేక‌పాటి ఏకంగా 82,888 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఈ ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి డిపాజిట్ గ‌ల్లంతు కావ‌డం గ‌మ‌నార్హం. ఓట్ల లెక్కింపులో మొత్తంగా 20 రౌండ్ల పాటు కౌంటింగ్ జ‌ర‌గ్గా.. ప్ర‌తి రౌండ్‌లోనూ మేక‌పాటి ఆధిక్యం సాధిస్తూ వ‌చ్చారు. వెర‌సి ఈ ఎన్నిక‌లో ఆయ‌న ఏక‌ప‌క్ష విజ‌యాన్ని న‌మోదు చేశారు.

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల్లో 1,37,081 ఓట్లు పోల్ కాగా... వాటిలో మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి 1,02,074 ఓట్ల‌ను సాధించారు. 15వ రౌండ్ పూర్తి అయ్యే స‌రికే మొత్తం పోలైన ఓట్ల‌లో 50 శాతానికి పైగా ఓట్ల‌ను ద‌క్కించుకున్న విక్ర‌మ్ రెడ్డి అప్ప‌టికే త‌న విక్ట‌రీని ఖ‌రారు చేసుకున్నారు. ఆ త‌ర్వాత 5 రౌండ్లు ఆయ‌న‌కు ద‌క్కిన మెజారిటీని తేల్చేందుకు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డ్డాయి. దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో జ‌రిగిన ఈ ఎన్నికలో ఆయ‌న వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన విక్ర‌మ్ రెడ్డి విజ‌యం సాధించారు.


More Telugu News