ప్రపంచ జనాభాలో సగం మంది సోషల్​ మీడియా వాడుతున్నారు.. ఎన్ని కోట్ల మంది అంటే?

  • ప్రపంచం వ్యాప్తంగా 462 కోట్ల మంది వినియోగదారులు
  • ఈ ఏడాదే కొత్తగా 42 కోట్లు పెరుగుదల 
  • ఫేస్ బుక్ ను వాడుతున్నది 291 కోట్లు
  • గ్లోబల్‌ సోషల్‌ మీడియా స్టాటిస్టిక్స్‌  రీసెర్చ్‌ సమ్మరి–2022లో వెల్లడి 
ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌ మీడియా వినియోగం పెరుగుతోంది. ఇంటర్నెట్ విస్తృతి, టెక్నాలజీ పెరగడంతో  సోషల్ మీడియా వైపు జనాలు ఆకర్షితులు అవుతున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి ప్రపంచంలో సోషల్ మీడియాను ఉపయోగించే వారి సంఖ్య 462 కోట్లకు చేరుకుంది. 2021 జనవరి నాటికి 420 కోట్ల మంది సోషల్‌ మీడియా యూజర్లు ఉండగా.. ఏడాది కాలంలోనే 42 కోట్ల మంది పెరిగారు. 

ప్రస్తుతం ప్రపంచ జనాభాలో  62.5 % మంది ఇంటర్నెట్‌ వాడుతుండగా.. 58.4% మంది సోషల్‌ మీడియాను వినియోగిస్తున్నారు. ‘గ్లోబల్‌ సోషల్‌ మీడియా స్టాటిస్టిక్స్‌ రీసెర్చ్‌ సమ్మరి–2022’ ఈ విషయాలు వెల్లడించింది. ఇంటర్నెట్‌ను వాడుతున్న వారిలో 93.4% మంది ఏదో ఒక సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం వినియోగిస్తున్నట్టు తేలింది. ప్రతి వ్యక్తి రోజుకు సగటున 2.27 గంటల పాటు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. సోషల్‌ మీడియాను ఉపయోగించే వారిలో 74.8% మంది 13 ఏళ్లకు పైగా వయసున్న వారే కావడం విశేషం.

 సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్‌ అగ్రస్థానంలో ఉంది. అత్యధికంగా 291 కోట్ల మంది ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు. 265.2  కోట్ల మంది వినియోగదారులతో యూట్యూబ్‌ రెండోస్థానంలో నిలిచింది.  200 కోట్ల మందితో వాట్సాప్‌ మూడో స్థానంలో ఉంది.  ఫేస్‌బుక్‌ వాడేవారిలో  56.4 శాతం పురుషులే ఉన్నారు.


More Telugu News