ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్.. భారీ విజయం దిశగా వైసీపీ

  • ఆరో రౌండ్ వరకు 25 వేల మెజారిటీ
  • రౌండ్ రౌండ్ కు పెరుగుతున్న ఆధిక్యం
  • కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఆధికార వైసీపీ భారీ విజయం సాధించేలా కనిపిస్తోంది. ఆదివారం ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపులో రౌండ్ రౌండ్ కూ వైసీబీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యం పెరుగుతోంది. ఆరు రౌండ్లు పూర్తయ్యే సరికి విక్రమ్‌రెడ్డి 25 వేలకు పైగా మెజారిటీ సాధించారు.

ఆంధ్రా ఇంజినీరింగ్‌ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 14 టేబుళ్ల ద్వారా 20 రౌండ్లలో లెక్కించనున్నారు. తొలిరౌండ్‌లోనే వైసీపీకి 5వేల ఓట్ల మెజార్టీ లభించింది. విక్రమ్‌రెడ్డికి 6 వేలకు పైగా ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌కు 700 పైచిలుకు ఓట్లు వచ్చాయి. రెండు, మూడో రౌండ్లోనూ వైసీపీకి అధిక్యం లభించింది. ఐదో రౌండ్‌ పూర్తయ్యేసరికి వైసీపీకి 21, 241 ఓట్ల మెజారిటీ లభించింది. ఆరో రౌండ్ వరకు విక్రమ్ కు 31 వేల ఓట్లు రాగా... భరత్‌ కుమార్ కేవలం 5 వేల ఓట్లు మాత్రమే సాధించారు. వైసీపీ విజయం ఖాయం అని తేలడంతో బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ కౌంటింగ్‌ హాలు నుంచి వెళ్లిపోయారు. 

రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్‌ యాదవ్‌ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు.


More Telugu News