స్టోక్స్ కు దీటైన ఆటగాడు టీమిండియాలో అతడే: మంజ్రేకర్

  • జులై 1 నుంచి టీమిండియా, ఇంగ్లండ్ టెస్టు
  • ఇంగ్లండ్ కు స్టోక్స్ ఉన్నాడన్న మంజ్రేకర్
  • భారత్ కు పంత్ ఉన్నాడని వెల్లడి
  • మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలడని కితాబు
టీమిండియా, ఇంగ్లండ్ మధ్య గతంలో వాయిదాపడిన టెస్టు రీషెడ్యూల్ చేసిన మీదట జులై 1 నుంచి జరగనుంది. బర్మింగ్ హామ్ లో జరిగే ఈ టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా ముందుగానే ఇంగ్లండ్ చేరుకుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో, మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. ఇంగ్లండ్ జట్టులో ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేయగల ఆటగాడు బెన్ స్టోక్స్ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. అయితే, స్టోక్స్ కు దీటైన ఆటగాడు టీమిండియాలో కూడా ఉన్నాడని వెల్లడించాడు. 

ఆ ఆటగాడు రిషబ్ పంత్ అని స్పష్టం చేశాడు. పంత్ కూడా మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగల సత్తా ఉన్నవాడని వివరించాడు. "అగ్రశ్రేణి ఆటగాడు రోహిత్ శర్మ ఉన్నాడు... విరాట్ కోహ్లీ తదితర గొప్ప బ్యాట్స్ మెన్ కూడా జట్టులో ఉన్నారు. షమీ, బుమ్రా రూపంలో మంచి బౌలర్లు ఉన్నారు. అయితే, రిషబ్ పంత్ టెస్టుల్లోకి వచ్చిన కొద్దికాలంలోనే మూడు మహోన్నత ఇన్నింగ్స్ లు ఆడాడు. ఆ మూడు ఇన్నింగ్స్ లు వేర్వేరు ప్రత్యర్థులపై, భిన్న పరిస్థితుల్లో ఆడాడు. అందుకే... మీకు బెన్ స్టోక్స్ ఉంటే, మాకు పంత్ ఉన్నాడని చెబుతాను. 

పరిమిత ఓవర్ల క్రికెట్ తో పోల్చితే టెస్టు క్రికెట్లో పంత్ తిరుగులేని ఆటగాడు. 20 డాట్ బాల్స్ ఆడి, ఆపై మూడు సిక్సులు కొట్టగల ఆటగాడు పంత్. పరిస్థితులకు తగిన విధంగా, ప్రత్యర్థి బౌలర్ కు తగ్గట్టుగా తన ఆటతీరును మలుచుకోగలడు. పరిమిత ఓవర్ల క్రికెట్ ఒత్తిడితో పోల్చితే, టెస్టుల్లో ఎప్పుడు తగ్గాలో, ఎప్పుడు కొట్టాలో పంత్ కు వెసులుబాటు ఉంటుంది" అని మంజ్రేకర్ వివరించాడు. 

ఇటీవల దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ లో పంత్ దారుణంగా విఫలం కాగానే, అతడి ఫామ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన పంత్ ప్రాక్టీసు మ్యాచ్ లో 87 బంతుల్లో 76 పరుగులు చేయడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి.


More Telugu News