రెబెల్ ఎమ్మెల్యేల కోసం 3 చార్టర్డ్ విమానాలు, 70 లగ్జరీ గదులు... ఖర్చుకు వెనుకాడని ఏక్ నాథ్ షిండే!

  • శివసేన పార్టీలో తీవ్ర సంక్షోభం
  • 40 మందికి పైగా ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకున్న షిండే
  • గువాహటిలో మకాం
  • వారం రోజుల ఖర్చు రూ.1.12 కోట్లు!
నిన్న మొన్నటి దాకా బీజేపీకి కొరకరాని కొయ్యలా ఉన్న శివసేన పార్టీ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. మంత్రి ఏక్ నాథ్ షిండే రగిల్చిన రెబెల్ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. తొలుత 37 మంది ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకున్న షిండే, ఇప్పుడు తన బలాన్ని 40 దాటించారు. ఇంతమంది ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. వారిని గుప్పిట జారకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యమైన విధి. 

తన మాట విని తన వెంట వచ్చిన రెబెల్ ఎమ్మెల్యేల కోసం షిండే భారీగా ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల తరలింపు కోసం 3 చార్టర్డ్ విమానాలు వినియోగించారు. ఎమ్మెల్యేలను మొదట రోడ్డు మార్గంలో ముంబయి నుంచి గుజరాత్ లోని సూరత్ తరలించారు. అక్కడి నుంచి అసోంకు ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్లారు.

గువాహటిలో వారి కోసం రాడిసన్ బ్లూ స్టార్ హోటల్లో ఏకంగా 70 గదులు బుక్ చేశారు. వారి కోసం ఆ విలాసవంతమైన హోటల్లో ఒక మీటింగ్ హాల్, స్విమ్మింగ్ పూల్, స్పా, ఐదు రెస్టారెంట్లు సేవలు అందించనున్నాయి. ఇక ఆహారం, ఇతర సేవల నిమిత్తం రోజువారీ ఖర్చు రూ.8 లక్షలు కాగా, వారం రోజులకు ఆ బిల్లు 56 లక్షలైంది. రూమ్ రెంట్ అన్నీ కలిపితే రూ.1.12 కోట్లయింది. 

రాడిసన్ బ్లూ హోటల్లో మొత్తం 196 గదులు ఉండగా, 70 రూములు రెబెల్ ఎమ్మెల్యేలు, వారి సహాయక సిబ్బంది కోసం బుక్ చేశారు. శివసేన రెబెల్ ఎమ్యెల్యేలు బస చేసిన నేపథ్యంలో, ఆ హోటల్ యాజమాన్యం కొత్త బుకింగ్ లు నిలిపివేసింది. అయితే, ముందే బుక్ చేసుకున్నవారికి మాత్రం మినహాయింపునిస్తోంది. ఆ హోటల్లోని సమావేశ మందిరం, రెస్టారెంట్లలో ఎలాంటి అతిథులను అనుమతించడంలేదు. కేవలం హోటల్ లో ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

అంతకుముందు, రెబెల్ ఎమ్మెల్యే సూరత్ లోని లీ మెరిడియన్ హోటల్ లో బస చేయగా, అక్కడ ఒక్క రాత్రి బస చేయాలంటే రూముకు రూ.2,300 (ప్రారంభధర) చెల్లించాలి. ఇక, ఎమ్మెల్యేలను సూరత్ నుంచి గువాహటి తరలించేందుకు ఎంబ్రాయర్ ఈఆర్జే-135ఎల్ఆర్ చార్టర్డ్ ప్లేన్ ఉపయోగించారు. దీని అద్దె రూ.50 లక్షలు. ఇదే కాకుండా, మరో రెండు బిజినెస్ జెట్ విమానాలను కూడా షిండే వర్గం వినియోగించింది. సూరత్ నుంచి గువాహటికి ఒక్కో విమానం ఖర్చు రూ.35 లక్షలు అని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.


More Telugu News