చిత్తూరు మాజీ మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారు: డీజీపీకి చంద్రబాబు లేఖ

  • 2015లో కఠారి అనురాధ, కఠారి మోహన్ హత్య
  • విచారణలో జాప్యం చేస్తున్నారన్న చంద్రబాబు
  • కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడి
  • పోలీసులపై చంద్రబాబు ఆరోపణలు
ఏడేళ్ల కిందట చిత్తూరులో మాజీ మేయర్ కఠారి అనురాధ, కఠారి మోహన్ దంపతులు హత్యకు గురికావడం అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. అయితే, ఈ హత్య కేసు విచారణలో జాప్యం చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. జాప్యం లేకుండా నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారని, అయితే బాధితుల వినతిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు సాక్షులను బెదిరిస్తున్నారని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు. కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండడం సరికాదని తెలిపారు. 

అటు, మాజీ మేయర్ కఠారి హేమలత విషయంలోనూ పోలీసుల వైఖరి దారుణంగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసు చర్యలను నిరసించిందన్న కారణంగా హేమలతపై పోలీసు జీపు ఎక్కించారని, ఇప్పుడు ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉందని పేర్కొన్నారు. అయితే, హేమలత గాయపడడానికి కారకులైన వారిని ఆసుపత్రిలో చేర్చి, తిరిగి హేమలతపైనే కేసు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు.


More Telugu News