ద్రౌపదికే నా మద్దతు.. విపక్షాలు నన్ను సంప్రదించలేదు: మాయావతి
- తాము బీజేపీకి అనుకూలమో.. కాంగ్రెస్ కు వ్యతిరేకమో కాదన్న మాయావతి
- ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేయడమే తమ ఉద్దేశమని వెల్లడి
- తామెప్పుడూ అణగారిన వర్గాలకు అండగా ఉంటామని వ్యాఖ్య
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతిస్తున్నట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే ముందు విపక్షాల కూటమి తనను సంప్రదించలేదని ఆమె చెప్పారు. బీఎస్పీ ఉద్యమంలో ఆదివాసీ సమాజం ఒక ముఖ్యమైన భాగమని... అందుకే ఆదివాసీ సామాజికవర్గానికి చెందిన ముర్ముకు మద్దతివ్వాలని నిర్ణయించామని తెలిపారు. బీజేపీకి అండగా ఉండడమో లేక కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడమో తమ ఉద్దేశం కాదని అన్నారు. సమర్థత, అంకితభావం కలిగిన ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేయడమే తమ ఉద్దేశమని చెప్పారు.
దళితుల కోసం పని చేస్తున్న ఏకైక జాతీయ పార్టీ బీఎస్పీ అని మాయావతి అన్నారు. బీజేపీనో, కాంగ్రెస్ నో అనుసరించే పార్టీ తమది కాదని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో ముడిపడిన పార్టీ కూడా తమది కాదని అన్నారు. తామెప్పుడూ అణగారిన వర్గాలకు అండగా ఉంటామని... ఆ వర్గాలకు చెందిన వ్యక్తులకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే పార్టీలకు తాము మద్దతు పలుకుతామని చెప్పారు.
మరోవైపు విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. రాష్ట్రపతి ఎన్నికలు జులై 18న జరగనున్నాయి. జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది.