హజ్​ యాత్ర కోసం భారత్​ తో సిరీస్​ కు దూరమైన ఇంగ్లండ్​ స్పిన్నర్​.. ఎవరంటే..!

  • మక్కా వెళ్లేందుకు ఆదిల్ రషీద్ కు ఇంగ్లండ్ బోర్డు అనుమతి
  • రెండు వారాలు యాత్రలో పాల్గొననున్న ఆదిల్
  •  జులై 7-17 మధ్య భారత్, ఇంగ్లండ్ టీ20, వన్డే సిరీస్ లు
భారత్ తో  వన్డే, టీ20 సిరీస్ ల్లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కీలక ఆటగాడి సేవలు కోల్పోనుంది. ఈ సిరీస్ లకు ఆ దేశ అగ్ర స్పిన్నర్ ఆదిల్‌ రషీద్‌ అందుబాటులో ఉండటం లేదు. ముస్లిం అయిన రషీద్.. హజ్‌ యాత్రలో పాల్గొనడం కోసం కొన్ని రోజులు జాతీయ జట్టుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. 

ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం మక్కాను సందర్శించుకునేందుకు తనకు కొంత విరామం ఇవ్వాలని, భారత్‌తో తలపడబోయే జట్టు కోసం తనను ఎంపిక చేయొద్దని ఆదిల్ రషీద్‌ చేసిన విజ్ఞప్తికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సానుకూలంగా స్పందించింది. అతని హజ్ యాత్రకు అనుమతులు మంజూరు చేసింది. దాంతో, శనివారమే తను సౌదీ అరేబియాకు బయల్దేరనున్నాడు. 

 తాను చాలా కాలం నుంచి హజ్‌ యాత్రకు వెళ్లాలనుకుంటున్నానని రషీద్ చెప్పాడు. కానీ తగినంత సమయం దొరకడం లేదన్నాడు. ఈ ఏడాది ఎలాగైనా యాత్రను పూర్తి చేయాలని భావించి తమ దేశ బోర్డుతో పాటు కౌంటీ క్లబ్ యార్క్ షైర్ యాజమాన్యానికి విషయం చెబితే సానుకూలంగా స్పందించాయని చెప్పాడు. రెండు వారాలు ఈ యాత్రలో పాల్గొంటానని తెలిపాడు. 

టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత జులై 7-17 తేదీల్లో భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ లు జరుగుతాయి. లెగ్ స్పిన్ తో పాటు ఉపయుక్తమైన బ్యాటర్ అయిన ఆదిల్ సేవలు కోల్పోవడం ఇంగ్లండ్ జట్టుకు కచ్చితంగా లోటే అవుతుంది. పైగా, భారత బ్యాటర్ల ఆటపై అతనికి మంచి అవగాహన ఉంది. అదే సమయంలో ఇంగ్లండ్ జట్టులో ఆదిల్ లేకపోవడం ఈ రెండు సిరీస్ ల్లో భారత్ కు సానుకూలాంశం అనొచ్చు.


More Telugu News