సరిగ్గా ఇదే రోజు... 1983లో విండీస్‌ను చిత్తు చేసి దేశానికి ప్రపంచకప్ అందించిన ‘కపిల్ డెవిల్స్’!

  • దేశంలో క్రికెట్ ఓ మతంగా మారడానికి ఇదే రోజున అడుగులు
  • క్లైవ్ లాయిడ్, వివ్ రిచర్డ్స్, మాల్కమ్ మార్షల్ వంటి దిగ్గజాలతో బలంగా ఉన్న విండీస్
  • భారత బౌలర్ల విజృంభణతో నీరుగారిన విండీస్
  • పనిచేయని రిచర్డ్స్ మెరుపులు
  • దేశానికి తొలి ప్రపంచకప్‌ను అందించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన కపిల్
భారత క్రికెట్ చరిత్రలో జూన్ 25కి ఓ ఘన చరిత్ర ఉంది. దేశ ప్రజల చిరకాల వాంఛ తీరిన రోజది. నేటికి సరిగ్గా 39 సంవత్సరాల క్రితం కపిల్ దేవ్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ ఫైనల్‌లో.. గార్డెన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్, వివ్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్, మాల్కమ్ మార్షల్ వంటి దిగ్గజాలున్న వెస్టిండీస్‌ జట్టును మట్టికరిపించి దేశానికి తొలి వన్డే క్రికెట్ కప్‌ను అందించింది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. 

అంతకుముందు 1975, 1979 ప్రపంచకప్‌లలో భారత జట్టు ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించడంతో 1983 ప్రపంచకప్ కోసం యూకే చేరుకున్న భారత జట్టుపై పెద్దగా అంచనాలేవీ లేవు. ప్రపంచకప్ కోసం భారత్ తమ జట్టును ప్రకటించినప్పుడు కూడా చాలామంది పెదవి విరిచారు. అయితే, కపిల్ దేవ్ మాత్రం దృఢ నిశ్చయంతోనే ఇంగ్లండ్‌లో అడుగుపెట్టాడు. ప్రపంచ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించాలని బలంగా అనుకున్నాడు.  

అంతకుముందు జరిగిన ఓ చిన్న ఘటన గురించి ఇక్కడ ప్రస్తావించాలి. ప్రపంచకప్ పర్యటన ప్రారంభమైనప్పుడు కపిల్ దేవ్ బ్యాగులో చిన్న షాంపేన్ బాటిల్ ఉండడాన్ని కీర్తి ఆజాద్ చూశాడు. ‘‘దాంతో ఏం చేయబోతున్నావ్. దానిని మాకిచ్చెయ్’’ అని అడిగాడు. కానీ కపిల్ దానిని ఇవ్వలేదు. చివరి వరకు దానిని అలాగే జాగ్రత్తగా పెట్టుకున్నాడు. కప్ గెలిచాక లార్డ్స్‌లో తాము ఓపెన్  చేసిన తొలి బాటిల్ అదేనని ఆజాద్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. అంటే కపిల్‌కు మొదటి నుంచి గెలుపై విశ్వాసం ఉంది. ప్రపంచకప్‌ను సాధించి తీరుతామని బలంగా నమ్మాడు. ‘‘కప్పు కొట్టాక దానిని తెరవాలన్న ఉద్దేశంతోనే ఆ షాంపేన్ బాటిల్‌కు మాకు ఇవ్వలేదు. కపిల్ సంకల్పం అలాంటిది’’ అని ఆజాద్ చెప్పుకొచ్చాడు. 

రెండుసార్లు డిఫెండింగ్ చాంపియన్ అయిన విండీస్‌ను మట్టికరిపించడంతో భారత్ తన ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించింది. రెండో గ్రూప్ స్టేజ్‌లో జింబాబ్వేను భారత్ మట్టికరిపించింది. అయితే, ఆ తర్వాతి మ్యాచుల్లో ఆస్ట్రేలియా, వెసిండీస్ చేతుల్లో భారీ ఓటములు కపిల్ సేనను ఇబ్బందులకు గురిచేశాయి. ఆ తర్వాత టన్‌బ్రిజ్ వెల్స్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ 175 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన తర్వాత భారత జట్టుపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మిగతా ఆటగాళ్లను కూడా లక్ష్యం దిశగా ఆ ఇన్నింగ్స్ ప్రోత్సహించింది.

అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్‌లు గెలుచుకుని హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్న విండీస్‌తో ఫైనల్‌లో భారత్ తలపడింది. విండీస్ స్కిప్పర్ క్లైవ్‌ లియోడ్‌ టాస్‌ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే, భారత్‌కు ఆరంభం ఏమంత కలిసి రాలేదు. దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ కేవలం 2 పరుగులకే ఆండీ రాబర్ట్స్‌కు దొరికిపోయాడు. అయితే, ఆ తర్వాత నిలదొక్కుకుంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మొహిందర్ అమర్‌నాథ్ (26)తో కలిసి కృష్ణమాచారి శ్రీకాంత్ (38) 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే, విండీస్ బౌలర్లు చెలరేగడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.  యశ్‌పాల్‌ శర్మ (11), సందీప్‌ పాటిల్‌ (27), కపిల్‌ దేవ్‌ (15) పెద్దగా రాణించలేకపోయారు. 

చూస్తుంటే ఇండియా 150 పరుగుల్లోపే చాపచుట్టేయడం ఖాయమని అనుకున్నారు. అయితే,  మదన్ లాల్ (17), సయ్యద్ కిర్మాణి (14), బల్విందర్ సంధు (11) సమన్వయంతో ఆడడంతో కపిల్ సేన 183 పరుగులు చేసి ప్రత్యర్థికి సవాలు విసిరింది. 

నిజానికి బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన క్లైవ్ లాయిడ్ సేనకు 184 పరుగుల విజయ లక్ష్యం చాలా తక్కువ. అయినప్పటికీ కపిల్ పట్టువదల్లేదు. ఐదు పరుగుల వద్దే ఓపెనర్ గార్డెన్ గ్రీనిడ్జ్‌ (1) బౌల్డ్ చేసిన సంధు భారత్ అభిమానుల్లో ఆశలు పెంచాడు. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వివియన్ రిచర్డ్స్ మాత్రం భారత శిబిరంలో గుబులు రేపాడు. 28 బంతుల్లో 7 బౌండరీలతో 33 పరుగులు చేసిన రిచర్డ్స్‌ను మదన్‌లాల్ అద్భుతమైన బంతితో బురిడీ కొట్టించాడు. భారీ షాట్‌ను ఆడబోయిన రిచర్డ్స్ బంతిని గాల్లోకి లేపగా కపిల్ అద్భుతమైన క్యాచ్‌తో రిచర్డ్స్‌ను పెవిలియన్ పంపాడు. దీంతో భారత శిబిరంలో మళ్లీ ఉత్సాహం ఉరకలెత్తింది. ఆ తర్వాత భారత బౌలర్లు అమర్‌నాథ్, మదన్ లాల్, కపిల్, సంధు, రోజర్ బిన్నీలు జూలు విదిల్చడంతో విండీస్ 140 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. 

 మైఖేల్ హోల్డింగ్‌ను ఎల్బీడబ్ల్యూ చేసిన అనంతరం డ్రెస్సింగ్ రూములోకి అమర్‌నాథ్ పరుగులు తీస్తున్న ఫొటో భారత క్రికెట్ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 39 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున లార్డ్స్ బాల్కనీలో కపిల్ దేవ్ ప్రపంచ కప్ ట్రోఫీని సగర్వంగా అందుకున్నాడు. ఈ ప్రపంచకప్ తర్వాత భారత్‌లో క్రికెట్‌ దినదిన ప్రవర్ధమానమైంది. ఓ మతంగా మారిపోయింది. ఇప్పుడు ప్రపంచంలోనే మేటి జట్టుగా భారత్ కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటోంది.


More Telugu News