రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కేసీఆర్ జాతీయ పార్టీ?

  • రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో పార్టీ  ప్రకటన వాయిదా
  • వచ్చే నెల రెండో వారం వరకు వివిధ రంగాల నిపుణులతో సమావేశం
  • నిన్న ప్రగతి భవన్‌లో జాతీయ మీడియా ప్రముఖులతో చర్చ
కొత్త పార్టీతో జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని నిర్ణయించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెలలో కొత్త పార్టీని ప్రకటిస్తారన్న వార్తలు వచ్చాయి. ఆ పార్టీ పేరు ‘భారతీయ రాష్ట్ర సమితి’ అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే, రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతానికి పార్టీ ఏర్పాటు ప్రకటనను వాయిదా వేసుకున్నారని, రాష్ట్రపతి ఎన్నికల తర్వాత పార్టీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. 

ప్రస్తుతం దేశం మొత్తం రాష్ట్రపతి ఎన్నికపైనే దృష్టిసారించడంతో పార్టీ ప్రకటన ఇప్పుడు సరికాదన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్ష కూటమి అభ్యర్థి అయిన యశ్వంత్ సిన్హాకే ఓటు వేయాలని ఇప్పటికే నిర్ణయించిన కేసీఆర్.. పార్టీ నేతలతో చర్చించిన తర్వాత అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు, కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో కేసీఆర్ ప్రస్తుతం దేశంలోని ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. గురువారం ఢిల్లీకి చెందిన ఆర్థిక నిపుణులతో ప్రగతి భవన్‌లో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. నిన్న జాతీయ మీడియా ప్రముఖులతో చర్చలు జరిపారు. వచ్చే నెల రెండో వారం వరకు కేసీఆర్ ఈ చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది.


More Telugu News