వాజపేయి నాటి బీజేపీతో ఇప్పటి బీజేపీకి పోలికే లేదు: యశ్వంత్ సిన్హా

  • మోదీ హయాంలో ప్రజాస్వామిక విలువలు ప్రమాదంలో పడ్డాయన్న యశ్వంత్  
  • వాటిని కాపాడేందుకే రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగానని స్పష్టీకరణ
  • గిరిజనుల సంక్షేమం కోసం ముర్ము కంటే తానే ఎక్కువ చేశానన్న సిన్హా
వాజపేయి నాటి బీజేపీతో పోలిస్తే ఇప్పటి బీజేపీకి ఇసుమంతైనా పోలిక లేదని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా విమర్శించారు. నిన్న ‘పీటీఐ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వాజపేయి నేతృత్వంలోని బీజేపీ సభ్యుడిగా తన రికార్డు పట్ల గర్విస్తున్నట్టు చెప్పారు. మోదీ హయాంలో ప్రజాస్వామిక విలువలు ప్రమాదంలో పడ్డాయన్నారు. దేశ ప్రజాస్వామిక విలువలు కాపాడేందుకే తాను పోటీలో నిలుచున్నట్టు చెప్పారు. గెలుస్తానన్న నమ్మకంతోనే బరిలోకి దిగినట్టు చెప్పారు. మోదీ ప్రభుత్వానికి ఏకాభిప్రాయంపై నమ్మకమే లేదని విమర్శలు గుప్పించారు. 

పనిలో పనిగా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపైనా యశ్వంత్ సిన్హా విమర్శలు చేశారు. గిరిజనులు, ఇతర అణగారిన వర్గాల కోసం ముర్ము కంటే తానే ఎక్కువ పనిచేశానని పేర్కొన్నారు. ఝార్ఖండ్ గవర్నర్‌గాను, ఇతర పదవుల్లో ఉన్నప్పుడు గిరిజనుల సంక్షేమానికి ముర్ము ఏం చేశారని యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు.


More Telugu News