మోదీ, అమిత్ షాల‌తో ద్రౌప‌ది ముర్ము భేటీ... రేపే రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా నామినేష‌న్‌

  • ఢిల్లీ చేరిన ద్రౌప‌ది ముర్ము
  • ముర్ము నామినేష‌న్‌పై సంత‌కాలు చేయ‌నున్న మోదీ, అమిత్ షా
  • ఎన్డీఏ సీఎంల‌ను ఢిల్లీకి ర‌ప్పిస్తున్న బీజేపీ
రాష్ట్రప‌తి ఎన్నిక‌ల రేసులో అధికార ప‌క్షం ఎన్డీఏ అభ్య‌ర్థిగా ఖ‌రారైన ద్రౌప‌ది ముర్ము గురువారం ఢిల్లీ చేరుకున్నారు. రేపు ఆమె త‌న నామినేష‌న్‌ను దాఖ‌లు చేయ‌నున్నారు. ఈ క్రమంలో నేడు ఆమె ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల‌తో భేటీ అయ్యారు. రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా త‌న‌ను ఎంపిక చేసినందుకు ఆమె వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ముర్ము గొప్ప‌త‌నాన్ని ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్డీఏ అభ్య‌ర్థిగా ముర్మును ఎంపిక చేయ‌డంపై దేశ‌వ్యాప్తంగా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మయ్యాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. స‌మాజంలోని అన్ని వ‌ర్గాలు ఆమె అభ్యర్థిత్వాన్ని స్వాగ‌తించాయ‌ని తెలిపారు. ఆయా స‌మ‌స్య‌ల‌పై ముర్ముకు మంచి అవ‌గాహ‌న ఉంద‌ని ఆయ‌న కొనియాడారు.

ఇదిలా ఉంటే... ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ముర్ము శుక్ర‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. ముర్ము నామినేష‌న్ ప‌త్రాల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా సంత‌కాలు చేయ‌నున్నారు. ముర్ము అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌తిపాదించేందుకు ఢిల్లీ రావాలంటూ ఎన్డీఏ త‌ర‌ఫున సీఎంలుగా కొన‌సాగుతున్న నేత‌ల‌కు బీజేపీ ఆహ్వానం ప‌లికింది.


More Telugu News