ప్రధాని మోదీని అధికారం నుంచి దింపేయాలనే కుట్రలు.. 'అగ్నిపథ్' ఆందోళనలపై రామ్ దేవ్ బాబా

  • అవన్నీ అర్థం లేని నిరసనలన్న రామ్ దేవ్ 
  • ఆందోళనకారులు యోగా చేయాలని సలహా 
  • అలాగైతే కుట్రపూరిత కార్యక్రమాలకు పాల్పడరని వ్యాఖ్య
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలకు ఎలాంటి అర్థం లేదని యోగా గురువు రామ్ దేవ్ బాబా విమర్శించారు. అవి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను అధికారానికి దూరం చేసే ఉద్దేశంతో కొందరు పన్నుతున్న కుట్రలని ఆరోపించారు. ఢిల్లీ యూనివర్సిటీలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘‘ఒకవేళ ఆందోళనకారులు యోగా చేసి ఉంటే.. వాళ్లు ఇలాంటి కుట్రపూరిత ఆందోళనలకు పాల్పడి ఉండేవారు కాదు. ఆందోళనకారులంతా యోగా చేయాలి. అగ్నిపథ్ కు వ్యతిరేక నిరసనలన్నీ అర్థరహితం. దేశంలో అరాచకం సృష్టించి ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అధికారానికి దూరం చేయాలనే ఎజెండాతో కొన్ని శక్తులు ఈ ఆందోళనలకు పాల్పడుతున్నాయి..” అని రామ్ దేవ్ బాబా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో యోగా ఉండవచ్చని.. కానీ యోగాలో రాజకీయం ఉండకూడదని పేర్కొన్నారు.


More Telugu News