పాపం వార్నర్​ ఒక్క పరుగుతో సెంచరీ మిస్​.. ఆస్ట్రేలియాకు హార్ట్​ బ్రేక్​

  • 99 పరుగుల వద్ద స్టంపౌటైన వార్నర్
  • వన్డేల్లో ఇలా ఔటైన రెండో క్రికెటర్ గా రికార్డు
  • నాలుగో వన్డేలో ఆసీస్ ఓటమి.. శ్రీలంకకు సిరీస్
తమ జట్టు విజయ లక్ష్యం 259 పరుగులు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ లక్ష్యాన్ని కరిగిస్తూ వస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ 99 పరుగుల వద్దకు చేరుకున్నాడు. ఇంకొక్క పరుగు చేస్తే సెంచరీ పూర్తవుతుంది. ఆ తర్వాత మరింత స్వేచ్ఛగా ఆడి జట్టును గెలుపు బాటలోకి తీసుకెళ్లొచ్చు అనుకుంటున్న సమయంలో వార్నర్ ను దురదృష్టం వెంటాడింది.

లంక బౌలర్ ధనంజయ వేసిన ఊరించే బాల్ ను క్రీజు ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేసి స్టంపౌట్ అయ్యాడు. దాంతో, వార్నర్ తీవ్ర నిరాశతో పెవిలియన్ చేరగా.. మ్యాచ్ ఓడిన ఆసీస్ కు చుక్కెదురైంది. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇలా 99 పరుగుల వద్ద స్టంపౌట్ అయిన రెండో బ్యాటర్‌గా వార్నర్ నిలిచాడు. 2002లో నాగ్‌పూర్‌ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన వన్డేలో భారత మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ కూడా 99 పరుగుల వద్ద ఇలానే ఔటయ్యాడు.  

 ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో 4 పరుగుల తేడాతో శ్రీలంక ఉత్కంఠ విజయం సాధించింది. మరో వన్డే మిగిలుండగానే 3-1తో సిరీస్ గెలిచింది. లంక సొంతగడ్డపై 30 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై తొలిసారి వన్డే సిరీస్ సొంతం కైవసం చేసుకోవడం విశేషం.  

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది.  లంక జట్టులో చరిత్‌ అసలంక (110) సెంచరీ, ధనంజయ డిసిల్వ (60) అర్ధ సెంచరీతో రాణించారు. ఛేదనలో ఆసీస్‌ 50 ఓవర్లలో 254 స్కోరుకు ఆలౌటై లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. వార్నర్ (99)తోపాటు ఆఖర్లో ప్యాట్‌ కమిన్స్‌ (35), కునెర్మన్‌ (15) పోరాడినా ఆసీస్ గట్టెక్కలేకపోయింది.


More Telugu News