వర్షంలో ఐదు కిలోమీటర్ల నడక.. ట్రక్కులో ముంబైకి చేరిన షిండే క్యాంపు ఎమ్మెల్యే!

  • షిండే క్యాంప్ నుంచి బయటపడిన ఎమ్మెల్యే కైలాస్ పాటిల్ కథనం
  • ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ తర్వాత కార్లలో తలసారి చెక్ పోస్ట్ కు తరలింపు
  • విషయం తెలుసుకుని అక్కడి నుంచి తిరిగొచ్చేసినట్టు వెల్లడి
శివసేన అసమ్మతి క్యాంప్ నుంచి బయటపడిన ఎమ్మెల్యే కైలాస్ పాటిల్ చెప్పిన స్టోరీ వింటే ఎవరికైనా సినిమా కథ గుర్తుకు వస్తుంది. మంగళవారం షిండే క్యాంప్ నుంచి బయటపడిన ఆయన ముంబైలోని సీఎం ఉద్ధవ్ థాకరే నివాసానికి చేరుకున్నారు. సీఎంకు పాటిల్ చెప్పిన స్టోరీని పార్టీ వర్గాలు లీక్ చేశాయి.

‘‘సోమవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ తర్వాత థానేలో డిన్నర్ ఏర్పాటు చేసినట్టు, అక్కడికి వెళ్లాల్సి ఉంటుందని శివసేన ఎమ్మెల్యేలకు చెప్పారు. దాంతో పాటిల్ కూడా వెళ్లారు. కానీ ఆయన ఎక్కిన కారు గోడ్ బందర్ రోడ్డులో వెళుతుండడంతో సందేహం వచ్చింది. 

షిండేకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు మూడు బృందాలుగా కార్లలో బయల్దేరారు. కొద్ది దూరం ప్రయాణం అనంతరం పాల్ఘర్ జిల్లా తలసారిలో సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఏక్ నాథ్ షిండేతో సమావేశం ఉందని ఎమ్మెల్యేలకు చెప్పారు. తలసారి చేరిన తర్వాత తనను క్షమించాలని, తాను వెనక్కి వెళ్లిపోతానని చెప్పి పాటిల్ అక్కడి నుంచి బయటపడ్డారు. 

ఆ సమయంలో వర్షం పడుతోంది. అయినా 5 కిలోమీటర్ల పాటు నడిచిన పాటిల్ ఆ తర్వాత ఓ మోటారు బైకు సాయంతో కొంత దూరం ప్రయాణించారు. అనంతరం ముంబై వెళుతున్న ఓ ట్రక్ సాయాన్ని కోరారు. అలా ముంబై సమీపంలోని దహిసార్ చెక్ పోస్ట్ సమీపానికి చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బందిని పాటిల్ ఫోన్లో సంప్రదించారు. వాహనాన్ని పంపగా,  బాంద్రాలోని సీఎం ఉద్దవ్ థాకరే నివాసానికి చేరుకున్నారు.


More Telugu News