‘మహా’ సర్కారు కుప్పకూలడం ఖాయమేనా?

  • రంజుగా ‘మహా’ రాజకీయాలు
  • మైనారిటీలో మహా వికాస్ అఘాడీ సర్కారు
  • విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తే ఉద్ధవ్‌కు కష్టమే!
శివసేన సీనియర్ నేత, రాష్ట్రమంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు రంజుగా మారాయి. మొత్తం 22 మందితో సూరత్‌లో మకాం వేసిన షిండే.. కాంగ్రెస్-ఎన్సీపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. షిండే కనుక వెనక్కి రాకుంటే మహా ప్రభుత్వం మనుగడ సాగించడం కష్టంగానే అనిపిస్తోంది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (MVA) సర్కారు కనుక విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తే పతనం కావడం తథ్యమేనని అనిపిస్తోంది. 

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. వాటిలో బీజేపీకి 106మంది ఎమ్మెల్యేలు ఉండగా, శివసేనకు 55, కాంగ్రెస్‌కు 44, ఎన్సీపీకి 54 మంది శాసనసభ్యులు ఉన్నారు. స్వతంత్రులు, ఇతర పార్టీల సభ్యులు కలిసి మరో 29 మంది ఉన్నారు. ఎంవీఏ సర్కారుకు ప్రస్తుతం 152 మంది సభ్యుల బలం ఉంది. అయితే, ఓ ఎమ్మెల్యే మరణించడంతో అసెంబ్లీలో సంఖ్యాబలం 287గా ఉంది. ఈ లెక్కన విశ్వాస పరీక్ష పెడితే అధికార కూటమికి 144 మంది సభ్యుల బలం అవసరం. 

అయితే, వీరిలో 21 మంది సేన ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేయడంతో ఆ పార్టీ శాసనసభ్యుల సంఖ్య 34కు పడిపోయింది. వీరిని తీసేస్తే సంకీర్ణ ప్రభుత్వ బలం 130కి పడిపోయి మైనార్టీలో పడిపోతుంది. తిరుగుబాటు చేసిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే సభలో కొత్త మెజారిటీ మార్కు 133 అవుతుంది. అదే జరిగితే బీజేపీ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. ఎందుకంటే.. సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు 134 ఓట్లు వచ్చాయని బీజేపీ చెబుతోంది. కాబట్టి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వస్తే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని చెబుతున్నారు.


More Telugu News