ఫోన్ నంబరు అడిగితే ఇవ్వనన్నందుకు.. గ్యాంగ్ రేప్ చేస్తామని యువతికి యువకుల బెదిరింపు

  • రాయదుర్గం ఐటీసీ కోహినూర్  హోటల్ బార్‌లో ఘటన
  • ఫోన్ నంబరు ఇవ్వకపోవడంతో మొదలైన గొడవ
  • ఎత్తుకెళ్లి అత్యాచారం చేస్తామని యువతికి బెదిరింపు
  • బాటిల్‌తో కొట్టడంతో తలకు ఐదు కుట్లు పడ్డాయన్న యువతి స్నేహితుడు
  • యువతి స్నేహితులే తమపై దాడికి పాల్పడ్డారంటున్న యువకులు
ఫోన్ నంబరు అడిగితే ఇచ్చేందుకు నిరాకరించడంతో సామూహిక అత్యాచారం చేస్తామంటూ యువతిని బెదిరించిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన న్యూట్రిషనిస్ట్ అయిన యువతి హైదరాబాద్‌లో ఉంటూ అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌లో పనిచేస్తున్నారు. విక్రమ్, విష్ణు అనే ఆమె స్నేహితులు ఏడాది తర్వాత కలవడంతో సెలబ్రేట్ చేసుకునేందుకు శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఓటినో బార్‌కు వెళ్లారు. 

అర్ధ రాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో సాద్, మాయాంక్ అగర్వాల్ అనే ఇద్దరు యువకులు ఆమె వద్దకు వచ్చి ఫోన్ నంబరు ఇవ్వాలని కోరారు. అందుకామె నిరాకరించడంతో వాగ్వివాదానికి దిగారు. దీంతో విష్ణు, విక్రమ్ కల్పించుకోవడంతో వాగ్వివాదం పెరిగి గొడవకు దారితీసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సాద్.. విష్ణు, విక్రమ్‌లపై దాడికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగక మరో ఆరుగురు స్నేహితులను బార్‌కు పిలిపించిన సాద్.. వారితో విక్రమ్, విష్ణులపై దాడి చేయించాడు. ఈ ఘటనలో విష్ణు తీవ్రంగా గాయపడ్డాడు. 

మరోవైపు, యువతిని తాకేందుకు ప్రయత్నిస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను కారులో బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేస్తామని, తమను ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరింపులకు దిగారు. గొడవ మరింత ముదరడంతో జోక్యం చేసుకున్న బార్ సిబ్బంది వారికి సర్దిచెప్పి బయటకు పంపించివేశారు. అనంతరం ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి. సాద్ తనపై బాటిల్‌తో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయని, ఐదు కుట్లు పడ్డాయని విష్ణు పేర్కొన్నాడు. 

అయితే, బాక్సర్ అయిన విక్రమ్ తనపై దాడి చేయడంతో గాయాలయ్యాయని సాద్ ఆరోపించాడు. ఆదివారం తెల్లవారుజామున మయాంక్, సాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, బాధిత యువతి, విష్ణు, విక్రమ్ సోమవారం సాయంత్రం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.


More Telugu News