ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము.. బీజేపీ అధ్యక్షుడు నడ్డా ప్రకటన

  • ఝార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేసిన ముర్ము
  • ఆదివాసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ద్రౌప‌ది
  • సుదీర్ఘ కాలంగా బీజేపీలో కొన‌సాగుతున్న ముర్ము 
భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌప‌ది ముర్ము బ‌రిలోకి దిగనున్నారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశంలో బీజేపీ అగ్ర‌నేత‌లు ముర్ము అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేశారు. మంగళవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా ముర్ము అభ్య‌ర్థిత్వాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఝార్ఖండ్ గ‌వ‌ర్నర్ గా ప‌నిచేసిన ముర్ము సుదీర్ఘ కాలంగా బీజేపీలో కొన‌సాగుతున్నారు. ఆదివాసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆమెను ఎన్డీఏ అభ్య‌ర్థిగా బీజేపీ ప్ర‌క‌టించింది.

ఇక ద్రౌప‌ది ముర్ము వ్య‌క్తిగ‌త వివ‌రాల్లోకి వ‌స్తే... ఒడిశాలోని మ‌యూర్భంజ్ జిల్లా బైద‌పోసి గ్రామంలో 1958 జూన్ 20న సంతాల్ అనే ఆదివాసీ తెగ కుటుంబంలో ముర్ము జ‌న్మించారు. ఉన్న‌త విద్య‌న‌భ్య‌సించిన ముర్ము...శ్యామ్ చ‌ర‌ణ్ ముర్మును వివాహ‌మాడారు. ఈ దంప‌తుల‌కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉండ‌గా... చాలా కాలం క్రిత‌మే భ‌ర్త‌తో పాటు ఇద్ద‌రు కుమారులు చ‌నిపోయారు. 

ముర్ము రాజ‌కీయ ప్ర‌స్థానం విష‌యానికి వ‌స్తే... ఆదిలోనే బీజేపీలో చేరిన ముర్ము 2000 మార్చిలో ఒడిశాలో కొలువుదీరిన బీజేపీ, బీజేడీ సంకీర్ణ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వాణిజ్య, ర‌వాణా, మ‌త్స్య‌, మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రిగా ముర్ము స‌త్తా చాటారు. ఆ త‌ర్వాత 2015లో ఝార్ఖండ్ గ‌వ‌ర్నర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ముర్ము... ఆ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఐదేళ్ల పాటు గ‌వ‌ర్న‌ర్‌గా కొనసాగిన తొలి గ‌వ‌ర్న‌ర్‌గా చరిత్ర సృష్టించారు. తాజాగా ఆమె ఎన్డీఏ త‌ర‌ఫున రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఎన్నికయ్యారు.


More Telugu News