ఇస్లాంకు యోగా వ్యతిరేకం అంటూ... మాల్దీవుల్లో యోగా కార్యక్రమాన్ని అడ్డుకున్న నిరసనకారులు

  • నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
  • మాల్దీవుల రాజధాని మాలేలో యోగా ఈవెంట్
  • కార్యక్రమానికి నిరసనల సెగ
  • టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే ప్రయోగించిన పోలీసులు
ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. భారత సంతతి ప్రజలు ఎక్కువగా ఉండే మాల్దీవుల్లోనూ యోగా కార్యక్రమం నిర్వహించారు. అయితే, రాజధాని మాలేలోని భారత ఎంబసీ ఓ స్టేడియంలో యోగా కార్యక్రమం నిర్వహిస్తుండగా, యోగా ఇస్లాంకు వ్యతిరేకం అంటూ నిరసనకారులు ముట్టడించారు. 

ఇస్లామిక్ సిద్ధాంతాలకు యోగా వ్యతిరేకం అనే ప్లకార్డులను ప్రదర్శిస్తూ, జెండాలు చేతబూని స్టేడియంలోకి చొరబడ్డారు. స్టేడియంలో భారత దౌత్య సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, తదితరులు యోగా చేస్తుండగా, ఆందోళనకారులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ విధ్వంసానికి పాల్పడ్డారు. ఆందోళనకారుల రాకతో యోగా చేస్తున్న వాళ్లు పరుగులు తీశారు. దాంతో, అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. 

ఈ దశలో పోలీసుల రంగప్రవేశం చేసి టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసు ఉన్నతాధికారి ఫత్మత్ నష్వా వెల్లడించారు. ఈ ఘటనపై మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ స్పందిస్తూ, పోలీసుల దర్యాప్తు ప్రారంభమైందని చెప్పారు. దీన్ని చాలా తీవ్రమైన వ్యవహారంగా భావిస్తున్నామని, ఈ ఘటనకు బాధ్యులను చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.


More Telugu News