సంక్షోభంలో మహారాష్ట్ర ప్రభుత్వం.. అది శివసేన అంతర్గత వ్యవహారం అన్న పవార్!

  • శివసేనకు షాక్ ఇచ్చిన ఏక్ నాథ్ షిండే
  • 21 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు
  • ఈ సమస్యను థాకరే పరిష్కరించగలరన్న పవార్
మహారాష్ట్రలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే మరో 21 మంది ఎమ్మెల్యేలతో కలిసి శివసేనకు షాకిచ్చారు. పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేసి గుజరాత్ లోని ఒక హోటల్ కు మకాం మార్చారు. వీరంతా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేస్తామని... ఈ రాత్రి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో చర్చిస్తానని పవార్ చెప్పారు. సమస్యను ఉద్ధవ్ థాకరే పరిష్కరించగలరనే నమ్మకం తనకు ఉందని అన్నారు. ఇది శివసేన పార్టీకి చెందిన అంతర్గత వ్యవహారమని చెప్పారు. 

శివసేన పార్టీ చీఫ్ విప్ పదవి నుంచి తొలగించడంతో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మరోవైపు ప్రభుత్వంలో తనకు టాప్ లెవెల్ పోస్ట్ (సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ) కావాలని ఆయన కోరుతున్నారు. దీనిపై శరద్ పవార్ స్పందిస్తూ... సీఎం పదవి కావాలని ఏక్ నాథ్ షిండే తమకు ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం సీఎం పదవి శివసేనకు, డిప్యూటీ సీఎం పదవి ఎన్సీపీకి ఉంటుందని చెప్పారు. ఇది శివసేనకు చెందిన సమస్య అని... వారు ఏ నిర్ణయం తీసుకున్నా తాము మద్దతిస్తామని అన్నారు. 

ప్రభుత్వంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తాము భావించడం లేదని పవార్ చెప్పారు. శరద్ పవార్ పార్టీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు... బీజేపీతో జతకడతారా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు పవార్ చిరునవ్వు నవ్వారు. తమ పార్టీ శివసేనకు మద్దతుగా ఉంటుందని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలతో తమకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు.


More Telugu News