వైసీపీ నేత ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు సీబీఐ స‌మ‌న్లు

  • న్యాయ వ్య‌వ‌స్థ‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో స‌మ‌న్లు
  • ఇప్ప‌టికే ఓ ద‌ఫా సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రైన ఆమంచి
  • బుధ‌వారం విచార‌ణ‌కు రావాలంటూ ఆయ‌న‌కు సీబీఐ స‌మ‌న్లు
వైసీపీ నేత‌, ప్ర‌కాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు సీబీఐ అధికారులు తాజాగా స‌మ‌న్లు జారీ చేశారు. న్యాయ వ్య‌వ‌స్థ‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో రేపు (బుధ‌వారం) త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని స‌ద‌రు స‌మ‌న్ల‌లో ఆమంచిని సీబీఐ అధికారులు ఆదేశించారు. ఈ కేసులో ఇప్ప‌టికే ఆమంచి ఓ ద‌ఫా సీబీఐ అధికారుల ముందు విచార‌ణ‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. నాడు విశాఖ‌లోని సీబీఐ కార్యాల‌యంలో ఈ విచార‌ణ సాగింది.

తాజాగా విజ‌య‌వాడ‌లోని సీబీఐ కార్యాల‌యంలో రేప‌టి విచార‌ణ జ‌ర‌గ‌నుంది. బుధ‌వారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సీబీఐ అధికారులు ఆమంచిని కోరారు. వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌పై ఏపీ హైకోర్టు వ‌రుస‌గా వ్య‌తిరేక తీర్పులు వెలువ‌రించిన నేప‌థ్యంలో వైసీపీకి చెందిన ప‌లువురు సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు హైకోర్టు న్యాయ‌మూర్తులు, న్యాయ వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌రిచేలా ప‌లు కామెంట్లు చేశారు. ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టు ఆదేశాల‌తో సీబీఐ అధికారులు కేసులు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే.


More Telugu News