1998లో డీఎస్సీ రాసిన అభ్యర్థికి ఇప్పుడు మోక్షం.. 55 ఏళ్ల వయసులో టీచర్ ఉద్యోగం

  • 1998లో డీఎస్సీలో మంచి ర్యాంకు
  • ఉద్యోగం వచ్చే సమయంలో డీఎస్సీపై వివాదం
  • ఇన్నేళ్ల తర్వాత పరిష్కారమైన వివాదం
  • ఫైల్‌పై సంతకం చేసిన సీఎం జగన్
1990లో బీఈడీ పూర్తిచేసి 1994, 1997లో డీఎస్సీ ఇంటర్వ్యూల వరకు వెళ్లిన ఓ అభ్యర్థి.. 1998లో డీఎస్సీలో మంచి ర్యాంకు సాధించాడు. ఉద్యోగం సాధించే సమయంలో ఆ డీఎస్సీ ప్రక్రియపై వివాదం చోటు చేసుకోవడంతో విషయం కాస్తా న్యాయస్థానానికి చేరింది. పరిష్కారమవుతుందేమోనని ఏళ్ల తరబడి ఎదురుచూసిన ఆ అభ్యర్థి ఇక లాభం లేదని వివాహం చేసుకుని వేరే ఊరికి వెళ్లిపోయి కూలిపనులు చేసుకుని జీవిస్తూ వస్తున్నాడు. ఆ కూలి పేరు నాగరాజు. అతడిది కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గంజహళ్లి.

వివాహం అనంతరం తన భార్య స్వగ్రామమైన గార్గేయపురానికి వెళ్లి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నాగరాజు వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. ఇన్నేళ్ల వయసులో ఇప్పుడాయనకు అదృష్టం వరించింది. వివాదాలు పరిష్కారం కావడంతో 1998 డీఎస్సీలో ఎంపికైన వారి నియామకాల ఫైల్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతకం చేశారు. ఉద్యోగానికి ఎంపికైన వారిలో నాగరాజు పేరు కూడా ఉంది. ఈ వయసులో తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడంపై నాగరాజు హర్షం వ్యక్తం చేశారు.


More Telugu News