విద్యార్థుల సమస్యలు కేసీఆర్ కు పట్టవా?: బండి సంజయ్

  • బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్న సంజయ్ 
  • ఆరు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా కేసీఆర్ స్పందించలేదని విమర్శ 
  • విద్యార్థులవి సిల్లీ సమస్యలన్న సబిత క్షమాపణ చెప్పాలని డిమాండ్ 
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. బాసర్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులవి సిల్లీ సమస్యలని వ్యాఖ్యానించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తక్షణమే విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల 12 డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. 

గత ఆరు రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కేసీఆర్ స్పందించడం లేదని... విద్యార్థుల సమస్యలు సీఎంకు పట్టవా? అని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై స్పందించేందుకు లేని సమయం... జాతీయ పార్టీ ఏర్పాటుకు మాత్రం ఉంటుందా? అని ప్రశ్నించారు. 

మరోవైపు హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశాలు జరిగే నొవాటెల్ లో సమావేశాల ఏర్పాట్లను బండి సంజయ్, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఈరోజు పరిశీలించారు. జులై 2, 3, 4 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి.


More Telugu News