అగ్నివీర్‌ మ‌ర‌ణిస్తే రూ.1 కోటి ప‌రిహారం: త్రివిధ ద‌ళాధిప‌తులు

  • అగ్నిప‌థ్ ప‌థ‌కంపై విమ‌ర్శ‌ల వెల్లువ‌
  • సందేహాల నివృత్తి కోసం మీడియా ముందుకు త్రివిధ ద‌ళాధిప‌తులు
  • ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ త‌ర్వాత మీడియా స‌మావేశం
  • నాలుగున్న‌రేళ్ల త‌ర్వాత అగ్నివీర్‌ల‌కు డిప్లొమా స‌ర్టిఫికెట్ ఇస్తామ‌ని వెల్ల‌డి
  • దానితో ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని భ‌రోసా
భార‌త సైన్యంలోకి భారీ ఎత్తున నియామ‌కాల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అగ్రిప‌థ్‌పై రేకెత్తిన అనుమానాల‌ను నివృత్తి చేసేందుకు భార‌త త్రివిధ ద‌ళాధిప‌తులు ఆదివారం మీడియా ముందుకు వ‌చ్చారు. ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో భేటీ అనంత‌రం వారు మాట్లాడుతూ అగ్నిప‌థ్ ప‌థ‌కానికి సంబంధించి ప‌లు కీల‌క అంశాలను ప్ర‌క‌టించారు. 

విధి నిర్వ‌హ‌ణ‌లో 'అగ్నివీర్' మ‌ర‌ణిస్తే బాధిత కుటుంబానికి రూ.1 కోటి ప‌రిహారం ఇవ్వ‌నున్న‌ట్లు వారు ప్ర‌క‌టించారు. అగ్నిప‌థ్ పై ఏకంగా రెండేళ్ల పాటు అధ్య‌య‌నం చేశాకే ఈ ప‌థ‌కానికి శ్రీకారం చుట్టిన‌ట్లు తెలిపారు. అనుభ‌వానికి, యువ‌శక్తికి ప్రాధాన్యం ఇస్తూ ఈ ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేశామ‌ని వెల్ల‌డించారు. 

సైన్యంలో స‌గ‌టు వ‌య‌సు త‌గ్గించేందుకు సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేస్తున్నామ‌ని త్రివిధ ద‌ళాధిప‌తులు తెలిపారు. భార‌త సైన్యంలో ఏటా 17,600 మంది రిటైర్మెంట్ తీసుకుంటున్నార‌ని చెప్పారు. అగ్నివీర్‌ల‌కు ఇచ్చే అల‌వెన్సుల్లో ఎలాంటి తేడాలు ఉండ‌వ‌ని ప్ర‌క‌టించారు. స‌ర్వీసు నిబంధ‌న‌ల్లోనూ వివ‌క్ష ఉండ‌ద‌ని తెలిపారు. నాలుగున్న‌రేళ్ల త‌ర్వాత సైన్యం నుంచి విర‌మించుకోవాలా? వ‌ద్దా? అనేది వారి ఇష్ట‌మ‌న్నారు. నాలుగున్న‌రేళ్ల త‌ర్వాత అగ్నివీర్‌ల‌కు డిప్లొమా స‌ర్టిఫికెట్ ఇస్తామ‌ని, దీనితో వారికి ఎన్నో ఉపాధి అవ‌కాశాలు అందుతాయ‌ని వారు వెల్ల‌డించారు.


More Telugu News