అగ్నిపథ్​ పై కాంగ్రెస్​ సత్యాగ్రహం... ఢిల్లీ జంతర్​మంతర్​ దగ్గర దీక్ష షురూ

  • ఉదయం 10 గంటలకు మొదలైన దీక్ష
  • హాజరైన ప్రియాంకా గాంధీ, ఎంపీలు, నేతలు
  • అగ్నిపథ్ రద్దు చేయాలని డిమాండ్
సాయుధ బలగాలలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో కాంగ్రెస్ పార్టీ నేరుగా కార్యాచరణ మొదలు పెట్టింది. ఈ పథకానికి వ్యతిరేకంగా యువకుల ఆందోళనకు సంఘీభావంగా సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం ఉదయం పది గంటలకు కాంగ్రెస్ ఈ దీక్ష ప్రారంభించింది.  

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ, ఎంపీలు, కార్యవర్గ సభ్యులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ బేరర్లు దీక్షలో కూర్చుకున్నారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలన్న ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తున్నారు. మరోవైపు జంతర్ మంతర్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రిటీష్ పాలకుల పోలీసులు, లాఠీలు, బ్యారికేడ్లే గాంధీజీ సత్యాగ్రహాన్ని ఆపలేకపోయాయని, ఇప్పుడు అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న సత్యాగ్రహాన్ని ఆపగలరా? అని ప్రశ్నించింది. 

 అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశంలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఈ రోజు తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.


More Telugu News