ప్రతీ ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఒక మహిళా జట్టు ఉండాలి: లలిత్ మోదీ

  • అప్పుడు భారత మహిళా క్రికెట్ బలం పెరుగుతుందన్న అభిప్రాయం
  • బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుందని ప్రశంస
  • ఐపీఎల్ ఫ్రాంచైజీలు లాభాల్లో ఉన్నందున పెట్టుబడులు పెట్టగలవని కామెంట్
ఐపీఎల్ ఎంతో ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్. తనకంటూ ఆదరణ, ఆర్థిక పరిపుష్టిని సంపాదించుకున్నది. అందుకే బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీల సంఖ్యను పదికి పెంచింది. కానీ, మహిళల ఐపీఎల్ లీగ్ కల సాకారం కావడం లేదు. ఎన్నాళ్ల నుంచో ఈ డిమాండ్ ఉంది. వచ్చే ఏడాది (2023) నుంచి మహిళల ఐపీఎల్ నిర్వహణ తమ ప్రాధాన్య అంశంగా బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించడం, తమ వంతు అన్నివిధాలుగా కృషి చేస్తామని చెప్పడం దీనిపై ఆసక్తిని పెంచింది.

ఐపీఎల్ మాజీ చైర్మన్, ఐపీఎల్ నిర్మాణం వెనుక ప్రధాన పాత్ర పోషించిన లలిత్ మోదీ దీనిపై స్పందించారు. బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకున్నట్టు ప్రశంసించారు. ప్రతీ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఒక మహిళా జట్టును కలిగి ఉండాలన్నారు. దీన్ని తప్పనిసరి చేయాలని అభిప్రయపడ్డారు. ‘‘ప్రతి ఐపీఎల్ ఫ్రాంచైజీ ఒక మహిళా జట్టును కలిగి ఉండొచ్చు. దీనివల్ల భారత మహిళా క్రికెట్ బలం పెరుగుతుంది. ఐపీఎల్ ద్వారా చక్కగా డబ్బులు సమకూర్చుకుంటున్న ఫ్రాంచైజీల యజమానులు మహిళా క్రికెట్ పైనా పెట్టుబడులు పెడతారు’’అని లలిత్ మోదీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

ఐపీఎల్ ఫ్రాంచైజీలు లాభాల్లో ఉన్నందున అవి మహిళా జట్లను కలిగి ఉండగలవని.. అవసరమైన పెట్టుబడి సమకూర్చగలవని లలిత్ మోదీ పేర్కొన్నారు.


More Telugu News