సంచలనం సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు

  • ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ లో అర్జెంటీనాపై విజయం
  • షూటౌట్ లో గెలిచిన భారత అమ్మాయిలు
  • నెదర్లాండ్స్ చేతిలో ఓడిన పురుషుల జట్టు
భారత మహిళల హాకీ జట్టు సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ ఐహెచ్) ప్రొ లీగ్ టోర్నమెంట్ లో అద్భుత విజయం సాధించింది. తమ కంటే ఎంతో బలమైన, టోక్యో ఒలింపిక్స్ లో రజతం సాధించిన అర్జెంటీనాకు షాకిచ్చింది. నెద్లర్లాండ్స్ లోని రోటర్ డామ్ లో శనివారం రాత్రి జరిగిన ఈ  మ్యాచ్ లో భారత్ షూటౌట్ లో 2-1 గోల్స్ తేడాతో అర్జెంటీనాను ఓడించింది. షూటౌట్ లో అర్జెంటీనా ఐదు ప్రయత్నాల్లో ఒకే గోల్ సాధించింది. అదే సమయంలో భారత క్రీడాకారులు గోల్స్ చేసి జట్టును గెలిపించారు.  

అంతకుముందు నిర్ణీత సమయంలో ఇరు జట్లూ చెరో మూడు గోల్స్ చేయడంతో మ్యాచ్ 3–3తో టై అయ్యింది. భారత క్రీడాకారిణి లాల్‌‌‌‌‌‌‌‌రెమ్‌‌‌‌‌‌‌‌సియామి మూడో నిమిషంలోనే తొలి గోల్‌‌‌‌‌‌‌‌ అందించింది.  అర్జెంటీనా నుంచి అగస్టినా ఏకంగా మూడు గోల్స్ కొట్టి తమ జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. అయితే, భారత్ కు చెందిన గుర్జీత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌ 37, 50వ నిమిషాల్లో రెండు గోల్స్ చేసి జట్టుకు ఓటమి తప్పించింది. విజేతను తేల్చేందుకు షూటౌట్ నిర్వహించగా.. అందులో భారత్ అద్భుతం చేసింది.  

 ఇదే టోర్నమెంట్ లో  నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌తో జరిగిన మ్యాచ్ లో భారత పురుషుల జట్టు షూటౌట్‌‌‌‌‌‌‌‌లో 1–4 తేడాతో ఓడిపోయింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లూ చెరో రెండు గోల్స్‌‌‌‌‌‌‌‌ చేశాయి. అయితే, షూటౌట్‌‌‌‌‌‌‌‌లో నెదర్లాండ్స్ వరుసగా నాలుగు గోల్స్ సాధించగా.. భారత్ నుంచి ఐదు ప్రయత్నాల్లో వివేక్‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ ఒక్కడు మాత్రమే బంతిని గోల్ పోస్టులోకి పంపాడు. దాంతో, పురుషుల జట్టుకు ఓటమి తప్పలేదు.


More Telugu News