వరదలతో అసోం కుదేలు.. 25 మంది మృతి.. గువహటి వీధుల్లో చేపల సందడి

  • పొంగి పొర్లుతున్న బ్రహ్మపుత్ర, ఉపనదులు
  • 32 జిల్లాలు, 31 లక్షల మందిపై ప్రభావం
  • 4,291 గ్రామాల్లోకి వరదనీరు
  • రాజధాని గువహటిలోనూ వరద ప్రభావం
అసోం రాష్ట్రం వరదలతో కుదేలవుతోంది. సాధారణ జనజీవనానికి విఘాతం ఏర్పడింది. రాజధాని గువహటి వీధుల్లోనూ వరద నీరు పారుతోంది. ఇప్పటి వరకు సుమారు 25 మంది మరణించి ఉంటారని అధికార యంత్రాంగం అంచనా. ఎనిమిది మంది ఆచూకీ కనిపించడం లేదు. రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో సుమారు 31 లక్షల మంది వరదల కారణంగా తీవ్ర ప్రభావానికి గురైనట్టు అంచనా వేస్తున్నారు. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు పొంగి ప్రవహిస్తుండడంతో.. సుమారు 4,291 గ్రామాల్లోకి వరద నీరు చేరింది. 66,455 హెక్టార్ల పంట భూమి నీట మునిగింది. 

వరద నీరు చేరినా తమ గ్రామాలను వీడి వెళ్లేందుకు ప్రజలు అంగీకరించడం లేదు. ఇంట్లో విలువైన వస్తువులను తాము నష్టపోవాల్సి వస్తుందని ఆలోచిస్తున్నారు. అధికారులు ఏదోలా నచ్చజెప్పి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిరంగ్ జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 100 మంది గ్రామస్థులను తాడు సాయంతో కాపాడారు. చిన్నపాటి పడవుల సాయంతో వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 514 సహాయక శిబిరాల్లో 1.56 లక్షల మంది ఆశ్రయం పొందారు.  

ప్రధాని మోదీ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్ చేసి తాజా పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 

గువహటి వీధుల్లో వరద నీరు పారుతుండగా.. పెద్ద పెద్ద చేపలు ఈదుకుంటూ వెళుతున్న దృశ్యాలు అక్కడి వారి కంట పడుతున్నాయి. దీంతో కొందరు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఇందులో ఒక వీడియో ఆసక్తితో పాటు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.


More Telugu News