16 రకాల ప్లాస్టిక్ వస్తువులను నిషేధించిన కేంద్రం.. జులై 1 నుంచే అమల్లోకి

  • ఇయర్ బడ్స్ నుంచి బెలూన్ల వరకు నిషేధం
  • ప్లాస్టిక్ ముడిసరుకును సరఫరా చేయొద్దని పెట్రో కెమికల్ సంస్థలకు ఆదేశం
  • ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు
ఇయర్ బడ్స్, బెలూన్లు, క్యాండీ, ఐస్‌క్రీం కోసం వాడే ప్లాస్టిక్ పుల్లలు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, ట్రేలు, ప్లాస్టిక్ స్వీట్‌బాక్స్‌లు, ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్‌లలోపు ఉండే పీవీసీ బ్యానర్లు, అలంకరణ కోసం వాడే పాలిస్ట్రైరిన్ (థర్మాకోల్) వంటి 16 రకాల ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం నిషేధించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ తెలిపింది. జులై 1 నుంచే నిషేధం అమల్లోకి వస్తుందని పేర్కొంది. 

ఒకసారి వాడిపారేసే వస్తువులను తయారుచేసే పరిశ్రమలకు ప్లాస్టిక్ ముడిసరుకును సరఫరా చేయవద్దని పెట్రోకెమికల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. వాణిజ్య సంస్థలేవీ తమ పరిధిలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను ఉపయోగించరాదంటూ స్థానిక సంస్థలు లైసెన్సులు జారీ చేయాలని, దీనిని ఉల్లంఘించి నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగించినా, విక్రయించినా వాటి లైసెన్సు రద్దు చేయాలని స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్టు అటవీ మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు వివరించింది.


More Telugu News