జవానులను కాంట్రాక్టు ఉద్యోగులుగా మార్చొద్దు: అసదుద్దీన్
- సాగు చట్టాల మాదిరే దీన్ని కూడా ఉపసంహరించుకోవాలన్న అసద్
- ఇది దేశానికి ఎంత మాత్రం మంచిది కాదని వ్యాఖ్య
- యువత ఆగ్రహానికి గురికావద్దని హితవు
కేంద్ర సర్కారు అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. సాగు చట్టాల మాదిరే దీన్ని కూడా ఉపసంహరించుకోవాలని కోరారు.
‘‘అగ్నిపథ్ పథకం కచ్చితంగా సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం ఇది. దేశానికి ఇది ఎంత మాత్రం మంచిది కాదు. మన నేవీ అధికారులు, జవానులు కాంట్రాక్టు ఉద్యోగులని లేదా కాంట్రాక్టు లెక్చరర్లని ప్రధాని మోదీ భావిస్తున్నారు. కానీ, వారిది గౌరవనీయమైన వృత్తి.
ప్రధాని మోదీ భూమి, సాగు చట్టాలను ఎలా అయితే ఉపసంహరించుకున్నారో.. భద్రత, దేశ యువతను దృష్టిలో పెట్టుకుని అగ్ని పథ్ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి’’ అని ఒవైసీ ఓ వార్తా సంస్థతో పేర్కొన్నారు.
‘‘సైనిక చీఫ్ ల వెనుక దాగి ఉండొద్దు మిస్టర్ మోదీ. మీ నిర్లక్ష్య నిర్ణయానికి బాధ్యత తీసుకునే దమ్ము ఉందా? తమ భవిష్యత్తు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఈ దేశ యువత మీకు సమాధానం చెబుతుంది’’ అంటూ అసదుద్దీన్ నిన్న ఒక ట్వీట్ కూడా చేశారు.