‘అగ్నివీర్’లకు కేంద్ర పోలీసు బలగాల్లో 10 శాతం రిజర్వేషన్.. కేంద్రం ప్రకటన

  • సెంట్రల్ ఆర్మ్ డ్ ఫోర్సెస్, అస్సామ్ రైఫిల్స్ లో కోటా
  • వయోపరిమితిలో మూడేళ్లపాటు సడలింపు
  • దేశవ్యాప్తంగా ఆందోళనల నేపథ్యంలో నిర్ణయం
అగ్నిపథ్ పథకం పేరుతో త్రివిధ దళాల్లో నాలుగేళ్ల స్వల్పకాల ఉద్యోగ కార్యక్రమంపై.. దేశవ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి తీవ్ర ఆందోళన, హింసాత్మక చర్యలు ఎదురవుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం కింద ‘అగ్నివీర్’గా దేశానికి సేవలు అందించిన వారికి కేంద్ర పోలీసు బలగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర హోంశాఖ ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం విడుదల చేసింది.

అగ్నివీర్ ఉద్యోగానికి 17.5-21 ఏళ్ల వరకు వయసున్న వారు అర్హులని తెలిసిందే. ఇలా ఎంపికై అగ్నివీర్ గా నాలుగేళ్లు పనిచేసి దిగిపోయిన తర్వాత.. త్రివిధ దళాల్లోనే రెగ్యులర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి కోసం 25 శాతం కోటాను కేంద్రం ముందే ప్రకటించింది. ఇప్పుడు దీనికి అదనంగా కేంద్ర ఆర్మ్ డ్ పోలీసు ఫోర్స్ లు (సీఏపీఎఫ్), అస్సామ్ రైఫిల్స్ లో ఉద్యోగాల్లో వీరికి 10 శాతం కోటాను కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. 

నాలుగేళ్లు పనిచేసిన తర్వాత కేంద్ర పోలీసు బలగాల్లో ఉద్యోగాలకు అర్హత సంపాదించుకునేందుకు వీలుగా వయోపరిమితిలోనూ మూడేళ్లపాటు సడలింపు ఇచ్చారు. సాధారణ అభ్యర్థులకు ఉండే గరిష్ఠ వయోపరిమితికి అదనంగా మూడేళ్లపాటు వీరు పోటీ పడొచ్చు. అలాగే, మొదటి బ్యాచ్ అగ్నివీర్ అభ్యర్థులకు ఐదేళ్లపాటు వయోపరిమితి సడలింపు ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగులుగా మార్చే అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తం అవుతుండడంతో వారిని శాంతింపజేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  



More Telugu News